వైద్యులపై కొరడా.. ఒకరు సస్పెన్షన్‌..

13 Dec, 2019 08:12 IST|Sakshi
ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రి

మారని రిమ్స్‌ తీరు

చర్యలకు దిగిన కలెక్టర్‌

సాక్షి, ఆదిలాబాద్‌ : వైద్యో నారాయణో హరి.. కళ్ల ముందు కనిపించని దేవుని కంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడినే దేవునిగా భావిస్తారు.. అంతటి మహోన్నతమైన వృత్తికి కొంతమంది కలాంకం తీసుకొస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారు. విధులు సక్రమంగా నిర్వహించక పోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా వారికి నచ్చినట్టే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విధులు సక్రమంగా నిర్వహించని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌పై వేటుపడింది. ఎట్టకేలకు కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ కొరడా ఝులిపించారు. ఈ చర్యలతో మిగితా డుమ్మా వైద్యుల్లో భయాందోళన మొదలైంది. ఇకనైనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇకనైనా తీరు మారేనా..
ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. గిరిజన మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)ను ఏర్పాటు చేశారు. వందపడకల ఆస్పత్రిని నిర్మించారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో కార్పొరేట్‌ వైద్యం అందుతుందని భావించిన జిల్లా ప్రజలకు చిన్నపాటి రోగాలకు తప్పా నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి. గుండె నొప్పి, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్‌మాల్‌ తదితర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. 

వైద్యుల తీరు...
రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంతమంది వైద్యులు ఉదయం 10గంటల వరకు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకే ఇంటి ముఖం పడుతున్నారు. అత్యవసర సమయంలో రిమ్స్‌కు వచ్చిన రోగులు వైద్యులు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. కాల్‌ డ్యూటీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యాహ్నం నుంచి జిల్లా కేంద్రంలో క్లినిక్‌లు నిర్వహిస్తూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటుగా క్లీనిక్‌లు...
రిమ్స్‌లో పనిచేసే కొంత మంది వైద్యులు ప్రైవేట్‌ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నిర్వహిస్తూ రెగ్యులర్‌ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. రిమ్స్‌ను పర్యవేక్షించాలి్సన ఓ అధికారి సైతం క్లినిక్‌ నిర్వహించడం గమనార్హం. వీరితో పాటు గైనకాలజిస్ట్‌లు, సివిల్‌సర్జన్‌లు, అనస్తీషియా వైద్యులు, ఈఎన్‌టీ, కంటి వైద్యులు, ఆర్థోపెడిక్‌లు క్లినిక్‌లు నిర్వహిస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఈ విషయం బహిరంగంగా  అందరికీ తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోంది.

బయోమెట్రిక్‌ ఉన్నా.. 
వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా డుమ్మా వైద్యులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఉదయం పూట బయోమెట్రిక్‌ వేలి ముద్రలు వేసి సాయంత్రం తమ క్లినిక్‌లు ముగించుకున్న తర్వాత వచ్చి థంబ్‌ పెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ బుధవారం రిమ్స్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన మరుసటి రోజే చర్యలను పూనుకున్నారు. 

ఒకరు సస్పెన్షన్‌.. మరొకరు సరెండర్‌
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సక్రమంగా హాజరు కాకపోవడం, బయోమెట్రిక్‌ హాజరులో థంబ్‌ పెట్టి ప్రైవేట్‌ క్లినిక్‌లో విధులు వ్యవహరించినందుకు అనస్తిషియా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సతీష్‌ను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేసినట్లు రిమ్స్‌ అధికారులు తెలిపారు. అదేవిధంగా బయోకెమిస్ట్రి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రమా శౌరి సక్రమంగా విధులకు హాజరుకాకపోవడం, గత కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్న దృష్ట్యా ఆమెను డీఎంఈకి సరెండర్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా