మాట దాటొద్దు

27 Mar, 2020 11:42 IST|Sakshi
జరిమానా విధిస్తామంటూ చెట్టుకు బోర్డు అతికించిన కొఠారివాసులు

వెల్లివిరిసిన చైతన్యం

ఊర్లోకి రావద్దంటూ చెక్‌పోస్టులు

జిల్లాలో 60పైగా గ్రామాల్లో నిబంధనలు

అనుమతి లేకుండా వస్తే జరిమానాలు

ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న ప్రజలు

కెరమెరి(ఆసిఫాబాద్‌): కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు పల్లెలు నడుం బిగించాయి. ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా పాటిస్తున్నాయి. రెండు రోజులుగా తమకు తాము స్వీయ నిర్బంధంలో ఉన్నాయి. వాహనాలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక ఊరి ప్రజలు మరో ఊరికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. మేము మీ గ్రామానికి రాము.. మీరు మా గ్రామానికి రావొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో కరోనా నివారణకు జిల్లావాసులు చైతన్యంతో ముందుకొస్తున్నారు. బయటనుంచి వచ్చే వ్యక్తులతో వ్యాధి ప్రబలే అవకాశం ఉండటంతో కొత్త వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి రావొద్దంటూ దారులు మూసి వేస్తున్నారు. నిత్యం గస్తీ కాస్తూ పల్లెలను కాపాడుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో గ్రామంలోకి వస్తే జరిమానా విధిస్తామని బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. 

జిల్లాలో 60 పైగా గ్రామాలు..
జిల్లాలో అనేక మండలాల్లో గ్రామాలు ఇప్పటికే స్వీయ నిర్బంధం పాటిస్తున్నాయి. రెండు రోజులుగా జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి తిర్యాణి, జైనూర్, సిర్పూర్‌(యూ), లింగాపూర్, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్‌నగర్, బెజ్జూర్, సిర్పూర్‌(టి) తదితర మండలాల్లో  60కి పైగా స్వీయ నిర్బంధంలో ఉన్నాయి. గ్రామాల్లోకి ఎవరూ రాకుండా అడ్డకట్ట వేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వాహనాదారులు అడ్డగించి వెనక్కి పంపిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సైతం ప్రధాన రహదారులను మూసి వేస్తున్నారు.

సరిహద్దులో భద్రత..
జిల్లాలోని సిర్పూర్‌(టి), వాంకిడి, కెరమెరి మండలంలోని అనార్‌పల్లి, సాంగ్వి గ్రామాలకు మహారాష్ట్ర సరిహద్దు ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసుకుని వచ్చిన వాహనదారులను పరీక్షించారు. ఆయా మండలాలకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రజల తరచూ రాష్ట్రంలోని తమ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలిసేందుకు వస్తుంటారు. బయటి నుంచి వచ్చిన వారి వివరాలు నమోదు ప్రభుత్వం జారీ చేయడంతో రెవెన్యూ, ఆరోగ్య, ఫారెస్ట్, పంచాయతీ, ఆర్టీవో శాఖల అధికారులు ప్రజలు కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. అధికారులు నుంచి ఆధారాలు ఉంటేనే ప్రవేశానికి అనుమతి ఇస్తున్నారు. కాగా కొత్త వారితోపాటు వలసల నుంచి వచ్చే ప్రజల వివరాలు సేకరణకు గ్రామస్తులు ప్రజల నడుం బిగిస్తున్నారు. దారులను దిగ్బంధించి, దారుల్లో భారీ వృక్షాలను పెడుతున్నారు. అదేవిధంగా ఆయా చెక్‌పోస్టుల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ కరోనా వైరస్‌ నివారణకు పోలీసులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీలు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు పాలుపంచుకోవాలని పిలుపునివ్వడంతో గురువారం నాయకులు పలుచోట్ల చురుగ్గా పర్యటించారు.   

స్వీయ రక్షణ కోసం
గ్రామంలో కొత్త వ్యక్తులను రానివ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నాం. ఇప్పటికీ మండలంలోని గ్రామాల ప్రజలకు కరోనా వైరస్‌ గురించి అవగాహన కల్పించాం. అందుకే పల్లెల్లోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. తమ కుటుంబ ఆరోగ్య రక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి.– పెందోర్‌ మోతిరాం,ఎంపీపీ, కెరమెరి 

మరిన్ని వార్తలు