కొండెక్కేదెలా..!

12 Jan, 2015 10:22 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : భౌగోళికంగా అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ప్రజల గొంతులు తడపడం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన సవాల్‌గా మారనుంది. సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెండు నియోజకవర్గాల గ్రామాలకు తాగునీరు అందించాలంటే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామీణ నీటి సరఫరా శాఖ గుర్తించింది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన వాటర్‌గ్రిడ్ పనుల సమీక్షలో ఈ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.

నిర్మల్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు, 930 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎస్సారెస్పీ గ్రిడ్‌ను డిజైన్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి బన్సపల్లి వద్ద నుంచి నీటిని ఎత్తిపోసుకోవాలని నిర్ణయించారు. ఈ బన్సపల్లి సముద్ర మట్టానికి 331 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల గ్రామాలు సుమారు 450 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయాలంటే కనీసం 181 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. మహబూబ్ ఘాట్లు ఎక్కించాల్సి ఉంటుంది.

ఈ మేరకు పైప్‌లైన్లు నిర్మిస్తే.. రానున్న రోజుల్లో ఈ పైప్‌లైన్ల నిర్వహణలో అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం ఖాయమని ఆ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఒక్కోసారి పైపులు పగిలి పోవడం వంటి ఘటనలు చోటు చేసుకుని నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించి గ్రిడ్ రూపకల్పనకు ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో కూడా నిపుణులు అందుబాటులో లేరు. ఇందుకోసం ఉన్నత సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని గ్రిడ్‌ను రూపకల్పన చేస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీర్ ఇంద్రసేన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.
 
రాసిమెట్ట వద్ద పంపింగ్ కేంద్రం..
బన్సపల్లి వద్ద ఎస్సారెస్పీ నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా నీటిని బూరుగుపల్లి(నేరడిగొండ మండలం)కి తరలిస్తారు. ఇక్కడ పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి, ఇక్కడి నుంచి మామడ మండల పరిధిలో ఉన్న రాసిమెట్టకు నీటిని పంపు చేస్తారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో 512 మీటర్ల ఉన్న ఈ రాసిమెట్టకు నీటిని ఎక్కిస్తే అక్కడి నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయడం సులభమవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ భావిస్తోంది.
 
కొలిక్కి వచ్చిన కడెం గ్రిడ్ సర్వే..
జిల్లాలో వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటి కటకటను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో నాలుగు గ్రిడ్‌లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సర్వే కోసం టెండర్లు పిలువగా, ఒక్క కడెం గ్రిడ్‌కు మాత్రమే సర్వే చేసేందుకు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని 594 గ్రామాల ప్రజల గొంతులు తడిపేందుకు రూపొందించిన ఈ గ్రిడ్ సర్వే పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మిగిలిన గ్రిడ్‌ల సర్వేకు మరోమారు టెండర్లు పిలవాలని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది.
 

మరిన్ని వార్తలు