పోరాడి ఓటేసిన మహిళకు ప్రజాస్వామ్య పురస్కారం 

12 Jan, 2020 04:33 IST|Sakshi
అవార్డుతో మౌనిక

సాక్షి, గుడిహత్నూర్‌ (బోథ్‌): తన పేరున పోలైన ఓటు తనది కాదని అధికారులను నిలదీసి ‘టెండర్‌ ఓటు’వేసి మరీ తన హక్కును వినియోగించుకున్న మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం తోషం తండాకు చెందిన రాథోడ్‌ మౌనిక.. గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లింది. అయితే అప్పటికే ఆమె ఓటును మరో మహిళ వేసి వెళ్లిపోయింది. దీనిపై మౌనిక అధికారులను నిలదీయడంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలింగ్‌ సిబ్బంది ఆమెకు టెండర్‌ ఓటు కేటాయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలుసుకొని పోరాడి ఓటు వేసినందుకు గాను ప్రభుత్వం ఆమెను గౌరవించింది. శనివారం హైదరాబాద్‌లోని తారామతి–బారదరిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా మౌనిక ప్రజాస్వామ్య పురస్కారం అందుకుంది.

మరిన్ని వార్తలు