ధూమ్‌..ధామ్‌ దండారి

29 Oct, 2019 07:59 IST|Sakshi
దండారి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ దంంపతులు

పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ దంపతులు

దేవతలకు ప్రత్యేక పూజలు

సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్‌) : ఆదివాసీలు దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించే దండారి ఉత్సవాలు అతి పవిత్రంగా, ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని హీరాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మారుతిగూడ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలకు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ దంపతులతో కలిసి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ దంపతులు హాజరయ్యారు. మారుతిగూడ దండారి బృందం గుస్సాడీ నృత్యాలు చేస్తూ వారికి ఘనంగా స్వాగతం పలికారు. అతిథులకు దండారి నిర్వాహకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో బట్టలు బహుకరించారు. గుస్సాడీలు, యువకులు, మహిళలు చేసిన సంప్రదాయ నృత్యాలను వారు తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

ఆదివాసీలు దండారి ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసిందని, ఒక్కో దండారికి రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి ఆదివాసీలు కృషి చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ దండారి ఉత్సవాల్లో గుస్సాడీ, కోలాటం, మహిళల నృత్యాలను కుటుంబ సమేతంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్‌ గోపి, ఎస్పీ బంధువులు ఫైలెట్‌ ఆనంద్‌ దంపతులు, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ కనక లక్కేరావ్, ఆదివాసీ సీనియర్‌ నాయకుడు, సలహాదారుడు సిడాం భీంరావ్, పెసా చట్టం జిల్లా కోఆర్డినేటర్‌ వెడ్మ బోజ్జు, డీడీ చందన, ఎంపీపీ పోటే శోభ, ఏఎంసీ చైర్మన్‌ రాథోడ్‌ వసంత్‌రావ్, సర్పంచ్‌ గోడం నాగోరావ్, ఆదివాసీ జిల్లా నాయకులు ఆర్క ఖమ్ము, కనక తుకారం, దండారి నిర్వహకులుదుర్వ జంగు, సిడాం శంకర్‌ ఉన్నారు. 


నార్నూర్‌లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న కలెక్టర్‌ 

గోండిభాషలో మాట్లాడుతూ..
నార్నూర్‌: సంధీర్‌కూన్‌ రాం రాం... సంధీర్‌ చకోట్‌ మంతీట్‌ అంటు గోండిభాషలో మాట్లాడుతూ కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఆదివారం ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఉమ్మడి మండలంలో పర్యటించి, గిరిజనులతో మమేకమయ్యారు. ఉమ్మడి మండలంలోని ఖైర్‌డట్వా, ఆర్జుని కొలాంగూడలో ఆమె భర్తతో కలిసి దండారి, గుస్సాడీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కలెక్టర్‌ గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఏటీడీవో చంద్రమొహన్, ఎంపీపీ కనక మోతుబాయి, పెసా చట్టం జిల్లా కో ఆర్డినేటర్‌ వెడ్మా బోజ్జు ఎస్‌ఐ విజయ్‌కూమార్, సుబ్బారావు, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షలు ఉర్వేత రూప్‌దేవ్, తుడందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మేస్రం శేఖర్, తొడసం నాగోరావు, గ్రామ పటేల్‌ మేస్రం రూప్‌దేవ్, నారంజీ పటేల్‌ తదితరులు ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు