దండారి.. సందడి

22 Oct, 2019 08:56 IST|Sakshi

ఆదివాసీ గోండుల పవిత్ర పండగ

ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబం

నేటి నుంచి దండారి సంబరాలు ప్రారంభం

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీల పెద్ద పండగ దండారి. గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే దండారి గుస్సాడి ఉత్సవాలు నేడు ప్రారంభంకానున్నాయి. విచిత్ర వేశాధారణతో అంతే అద్భుతమైన పద్ధతులతో వారు చేసే పూజలు, ఏర్పాట్లు వారి సంప్రదాయాలను పరిచయం చేస్తాయి. దీపావళికి పక్షం రోజుల ముందు ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక దండారి మొదలవుతుంది.

బలిదానంతో దండారి మొదలు..
ఆదివాసీలు గ్రామ కూడలిలో నెమలి ఈకలతో ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలు, జంతు చర్మంతో తయారు చేసిన డప్పులు, డోలు, గుమేల, ఫరా లాంటి వాయిద్యాలతో పాటు గజ్జెలు, కోలాలు, మంత్రదండం లాంటి రోకలి తదితర సంప్రదాయ వస్తువులను గ్రామ పటేల్‌ ఇంటి ముందు ఉంచి వాటికి బలిదానం చేసి ప్రత్యేక పూజలతో బోగి పండగ చేసి ఉత్సవాలు ఆరంభిస్తారు. గిరిజన గోండు గూడాల్లో గ్రామ పటేల్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆయన ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. గిరిజనులకు పటేల్‌ మాట వేదవాక్కు. అందుకే దండారి ఉత్సవాలు గ్రామ పటేల్‌ ఇంటి ముందే నిర్వహించడం ఆనవాయితీ.

ప్రత్యేక వేషధారణలు..
దండారి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు గుస్సాడి వేషాధారణ వేసిన వారు దండారి ముగింపు వరకు స్నానం చేయరు. ఒంటికి బూడిద పూసుకొని దాన్నే స్నానంగా భావించడం వీరి ఆచారం. దీనితో పాటు ముఖానికి మసి, ఎడమ భుజంపై జింక తోలు, మెడలో రుద్రాక్షలు, కుడి చేతిలో మంత్రదండం(రోకలి), జంతువుల కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన టోపీలు, కాళ్లకు గజ్జలు, నడుముకు వారి వస్తువుల సంచితో, విచిత్ర వేశధారణతో సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తారు.

ఇతర గ్రామాల గుస్సాడీలకు ఆథిత్యం..
గుస్సాడి వేశధారణ వేసినవారు ఒక సంవత్సరం తమ సొంత గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడి గిరిజనుల ఆథిత్య విందులో పాల్గొని ఆటపాటలతో, నృత్యాలతో కనువిందు చేయడం ఆనవాయితీ. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లిన గుస్సాడీలకు ఘన స్వాగతం పలుకుతారు. మొదట అథిత్యం పుచ్చుకున్న వీరు తర్వాతి సంవత్సరం తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. ఇలా ఆ గ్రామాల మధ్య బంధుత్వం పెరుగుతుంది. 

గుస్సాడీ వేషాలు.. థింసా నృత్యాలు
గిరిజనులు గుస్సాడీ వేషాన్ని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. గుస్సాడీ వేషాధారణ వేసిన వారికి వారి దేవతలు ఆవహిస్తారని చెబుతారు. అతని చేతికి ఉన్న మంత్రదండం శరీరాన్ని తాకితే ఎలాంటి రోగాలైన నయమవుతాయని వారి నమ్మకం. డప్పులు, భాజాలతో చప్పుళ్లకు అనుగుణంగా గజ్జెల అడుగులతో లయబద్ధంగా నాట్యం చేస్తూ గుస్సాడీ నృత్యాలు ప్రదర్శిస్తారు. గోండు గిరిజన మహిళలు కూడా పురుషులతో సమానంగా థీంసా నృత్యాలు చేస్తారు. 

నువ్వుల నూనెతో పూజలు..
గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటిలో దీపావళి పండగ సందర్భంగా గిరిజన మహిళలు పవిత్రంగా ఉపావాస దీక్ష చేస్తూ నువ్వులను రోటిలో దంచి నూనెను తీస్తారు. ఆ నూనెతో దండారి ముగింపు వరకు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. నెమలి టోపీల తయారీకి కేరాఫ్‌ పాటగూడ..
నెమలి పింఛం టోపీల తయారీలో కెరమెరి మండలంలోని పాటగూడ గ్రామం ప్రసిద్ధి గాంచింది. గడిచిన పాతికేళ్ల నుంచి ఈ గ్రామస్తులు నెమలి టోపీలను తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, సిర్పూర్‌(యు), కెరమెరి, తిర్యాణీ, వాంకిడి తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడి నుంచి నెమలి పింఛం టోపీలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒక్క టోపీ ఖరీదు రూ. 10 వేలు పలుకుతున్నా.. వీరు కేవలం రూ. 3 వేలు కూలీ కింద తీసుకుంటున్నారు. 

కొలబోడితో దండారి ముగింపు..
దీపావళి పండగ మరుసటి రోజు కొలబోడి ఉత్సవాలను దండారి సంబరాలు ముగిస్తారు. దీపావళి అనంతరం గుస్సాడీలు చివరి రోజున ఆనందంగా నృత్యాలు చేస్తారు. అనంతరం గ్రామ పొలిమేరల్లో ఉన్న ఇప్ప చెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. అక్కడ కొలబోడి సందర్భంగా నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేశధారణ, అలంకారణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్లు, మేకలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

పవిత్రమైన పండగ 
మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పండగా పవిత్రమైన పండగ. అత్యంత పవిత్రంగా గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాము. ఈ పండగకు బంధువుల ఇళ్లకు వెళ్తాం. గ్రామంలో ప్రతి రోజు రాత్రి గుస్సాడీలు థింసా నృత్యాలు, రేలారేరేలా ఆడపడుచుల నృత్యాలు ఆకట్టుకుంటాయి.        
 –పర్చ సాయన్న, బజార్‌హత్నూర్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా