గూడేల్లో ఎగిరిన నల్లజెండాలు

3 Jun, 2018 01:15 IST|Sakshi
ఇంద్రవెల్లిలో నల్లజెండాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీల ర్యాలీ

ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఆదివాసీల నిరసనలు

‘మా ఊళ్లో మా రాజ్యం’ నినాదంతో ఆందోళన 

కలెక్టరేట్‌పై నల్లజెండా ఎగురవేసే యత్నం, ఇద్దరి అరెస్టు

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ గ్రామా ల్లో తుడుందెబ్బ నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ‘మా ఊళ్లో మా రాజ్యం’  పేరుతో నినాదాలు మారుమోగాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నల్ల జెండాలు ఎగురవేస్తూ ఆదివాసీలు నిరసనలు తెలిపారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గూడేలతోపాటు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అరెస్టుచేశారు.  

మా భూమి మాకివ్వండి 
నేరడిగొండ మండలంలోని వాగ్ధారిలో తమ 105 ఎకరాల భూమిని లంబాడాల పేరుపై పట్టా చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ముందుగా వాగ్ధారి గ్రామంలో కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి నుంచి ధస్నాపూర్‌ వరకు 500 మంది ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో వచ్చేంత వరకు అక్కడే బైఠాయించారు. మా భూమి మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్డీవో సూర్యనారాయణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇంద్రవెల్లి తహసీల్దార్‌ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలకు ఆదివాసీలు వినతి పత్రం అందించారు.  

ఉపాధ్యాయుల అడ్డగింత 
ఆదిలాబాద్‌ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో లంబాడా మహిళా ఉపాధ్యాయులను బహిష్కరించాలని ఆదివాసీ విద్యార్థులు అడ్డుకున్నారు. తరగతులకు రానివ్వకుండా ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్‌ మండలంలోని కుమురంభీం చౌరస్తాలో, అంకోలి గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల జెండాను ఎగురవేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నేతలు నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. గుడిహత్నూర్‌ మండల కేంద్రం, బీంపూర్‌ మండల కేంద్రం, బోథ్‌ మండంలోని పట్నపూర్‌లో నల్ల జెండాలు ఎగురవేశారు. ఉట్నూర్‌ మండలంలోని చిన్నసుద్దగూడ, పెద్దసుద్దగూడ, పర్కుగూడ, కల్లూరిగూడల్లో.. నార్నూర్‌ మండలంలోని మంకాపూర్, నాగల్‌కొండ, బలాన్‌పూర్, శేకుగూడతోపాటు దాదాపు జిల్లావ్యాప్తంగా అన్ని ఆదివాసీ గూడెల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా