ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు

19 Nov, 2019 04:41 IST|Sakshi
 ఐటీడీఏ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఆదివాసీలు

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌

ఉట్నూర్‌కు వేలాదిగా వచ్చిన మహిళలు

ఉట్నూర్‌: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్‌ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది.

పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్‌ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు