కదిలిన ఆదివాసీ దండు

8 Dec, 2019 11:35 IST|Sakshi
ఆదివాసీలతో కిక్కిరిసిన ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌

9న ఢిల్లీలో సభ

రైలు ద్వారా జిల్లా నుంచి  3వేల మంది పయనం

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీ దండు కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9న జరిగే ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పయనమైంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి ఆదివాసీలు శనివారం జిల్లా కేంద్రానికి చేరుకొని ఆదిలాబాద్‌ నుంచి రైలుమార్గం ద్వారా నాగ్‌పూర్‌కు తరలివెళ్లారు. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక వాహనాలు, రైళ్ల ద్వారా వెళ్లగా, మిగతా వారు శనివారం బయల్దేరారు. రెండు జిల్లాల నుంచి 3వేల మంది వరకు వెళ్లినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి ఈ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ సభ జరగనుంది. గత కొన్నిరోజుల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు సభకు భారీ సంఖ్యలో తరలించేందుకు సన్నద్ధం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు, ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ ధ్రువపత్రాలను అరికట్టాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నారు.

గుస్సాడీ వేషధారణలో ఢిల్లీకి పయనమవుతున్న యువకులు

ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టగా, దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టే సభ ద్వారా ఈ విషయం దేశమంతటా తెలిసేందుకు ఆస్కారం ఉంది. ఆదివాసీ అస్తిత్వ పోరాట సభకు ఆదివాసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారని ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. సభకు ఎంతమంది తరలివెళ్తున్నారనే విషయంపై ఇంటెలిజెన్స్, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో అక్కడ జరిగే సభ ఏర్పాట్లను, జిల్లా నుంచి వచ్చే ఆదివాసీల ఏర్పాట్లు, తదితరవి పరిశీలిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చొరవ చూపుతున్నారు. రైలు మార్గం ద్వారా వెళ్లేవారికి మధ్యలో భోజనాలు, ఢిల్లీలో ప్రత్యేకంగా ఫంక్షన్‌హాల్‌లు ఏర్పాటుచేసినట్లు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు.

తుడుందెబ్బ జెండాలు తీసుకెళ్తున్న ఆదివాసీలు 

రైల్వేస్టేషన్‌లో సందడి..
ఢిల్లీలో జరిగే అస్తిత్వ పోరాట సభకు తరలివెళ్లేందుకు వచ్చిన ఆదివాసీలతో ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌ సందడిగా మారింది. వేలాది సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో రైల్వేస్టేషన్‌ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన జనంతో కిటకిటలాడింది. జై ఆదివాసీ.. జైజై ఆదివాసీ అనే నినాదాలతో రైల్వేస్టేషన్‌ మార్మోగింది.

మరిన్ని వార్తలు