కదంతొక్కిన ఆదివాసీలు

19 Nov, 2019 08:26 IST|Sakshi
వినతిపత్రం స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపి

సాక్షి, ఉట్నూర్‌(ఖానాపూర్‌): ఆదివాసీ మహిళా లోకం కదం తొక్కింది. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఐటీడీఏ ముట్టడి నిర్వహించారు. సూమారు ఐదు వేలకు పైగా ఆదివాసీలు అందోళనలో పాల్గొనడంతో ఉట్నూర్‌ మండల కేంద్రంతో పాటు ఐటీడీఏలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముందుగా ఆదివాసీలు మండల కేంద్రంలోని వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏటీడీఏకు వేల సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఉట్నూర్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఐటీడీఏ ప్రధాన రహదారిపై ఆదివాసీలు బైటాయించి నిరసన తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ అక్కడకు చేరుకుని వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. అయినా ఆందోళనను ఆదివాసీలు విరమించలేదు. ఐటీడీఏ కార్యలయం వద్ద పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయం లోకి ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలువాలంటూ పెద్ద ఎత్తున మహిళలు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. పలువురు గోడపై నుంచి దూకి లోనికి వెళ్లగా మహిళలు ఒక్కసారిగా మరో గేటు నుంచి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు.

ఐటీడీఏ ప్రధాన ద్వారం వద్దకు బైటాయించి నిరసన తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్‌లు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆదివాసీ మహిళ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వకూడదన్నారు. ఇచ్చిన తహసీల్దార్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు.  టీఆర్‌టీలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన 25 మంది అభ్యర్థులపై చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గోడం రేణుకబాయి, ఉపాధ్యక్షురాలు సోయం లలితబాయి, మహిళా నాయకులు మర్సకొల సరస్వతి, రంభబాయి, ఆత్రం సుగుణ,  నాయకులు కనక వెంకటేశ్వర్లు, మర్సకొల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. 

కుమురం భీం విగ్రహానికి నివాళులు..
నార్నూర్‌: ఉట్నూర్‌లో నిర్వహించిన ఆదివాసీ మహిళల ఐక్యత ర్యాలీకి నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి మహిళలు భారీగా తరలివెళ్లారు. మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ వలస వచ్చిన లంబాడీలతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 9న ఢిల్లీలో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా నాయకులు అడ సీతాబాయి, ఆత్రం అనసూయ, కనక సరిత, మందాడి కౌసల్యబాయిలతో పాటు తుడందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు తొడసం నాగోరావు, మేస్రం శేఖర్, మండలాధ్యక్ష, కార్యదర్శలు మానిక్‌రావు, ప్రభాకర్, నాయకులు మాన్కు, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు