సర్వే చేయించుకున్నచోటే దరఖాస్తు

16 Oct, 2014 01:18 IST|Sakshi

కార్డులు, పింఛన్ల దరఖాస్తులపై స్పష్టం చేస్తున్న అధికారులు
 

కార్డులు వచ్చాకే బదిలీకి అవకాశం అన్నింటికి ఆధార్‌తో లింక్
 
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే చేయించుకున్న ప్రాంతంలోనే ప్రజలు ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అవసరమైతే కార్డులు వచ్చాక బదిలీచేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి తమ పేర్లు, తమ కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేయించుకున్నారని... అయితే సర్వే వివరాలు ఒకచోట, ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం మరోచోట దరఖాస్తు చేసుకుంటే పరిశీలన కష్టమవుతుందని అధికారవర్గాలు వివరించాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఆహారభద్రతా కార్డుల కోసం 65.65 లక్షలు, పింఛన్ల కోసం 31.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ప్రభుత్వం అమలుచేసే అన్ని పథకాలకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తున్నారు. ఆధార్ లేకుండా లబ్ధిదారులకు నిధులు అందించడానికి వీలుండదని చెబుతున్నారు. రానున్న కాలంలో రైతులకు ఎరువులు, రుణాల మంజూరు, విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలకు సైతం ఆధార్‌కార్డులను అనుసంధానం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటి దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన సంగతి విదితమే.
 

మరిన్ని వార్తలు