‘నిషేధం’ అమలయ్యేనా?

24 Jan, 2015 05:45 IST|Sakshi
‘నిషేధం’ అమలయ్యేనా?

బాన్సువాడ : జిల్లాలో విచ్చలవిడిగా బోర్లు వేస్తూ వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజూ సగటున 60 వరకు బోర్లు వేస్తున్నారని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖనే ధ్రువీకరిస్తోంది. ఈ బోర్లకు ఏ ప్రాంతంలోనూ అనుమతి తీసుకొ న్న దాఖలాలు లేవు. వాల్టా చట్టం ప్రకారం బోర్లు వేసే సందర్భంలో తప్పకుండా సంబంధిత శాఖ ద్వారా అనుమతి తీసుకోవాలి.

అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితమైంది. విచ్చల విడిగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 127 గ్రామాల్లో బోర్ల తవ్వకాన్ని నిషేధిస్తూ ఇటీవల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల పంట పొలాలతో పాటు ఇండ్ల నిర్మాణానికి బోర్లు వేస్తున్న వారి సంఖ్య పెరిగింది. వంద మీటర్లలోపు దూరంలో రెండు బోర్లు వేయకూడదనే నిబంధనలున్నాయి. అయితే వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూమికి చిల్లు పెట్టడమే కాదు జేబుకు చిల్లు పడుతున్నా లెక్క చేయడం లేదు.

గ్రామ పంచాయతీల  ఆవ రణలో ‘అనుమతి లేనిదే బోరు వేయకూడదు. పర్యావరణానికి విఘాతం కలిగించవ ద్దు. ఎడాపెడా బోర్లు వేయొద్దు’ అని పేర్కొం టూ వాల్టా చట్టం గురించి రాస్తున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నీళ్లు లేవనే నిజం గ్రహించకుండానే బోర్ల తవ్వకానికి పూనుకొంటున్నారు. రైతులకు తోడు ప్రస్తు తం పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు వే గం పుంజుకోవడంతో తాగునీటికి సైతం బో ర్లు వేసే వారి సంఖ్య పెరిగిపోయింది.

బోరు లేనిదే ఇండ్ల నిర్మాణం చేపట్టమంటూ మేస్త్రీలు మొండికేయడంతో బోర్లు వేసిన తర్వాతే ఇం డ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. బోరు యం త్రాల యజమానులు సైతం కనీస నిబంధనలను పాటించకుండా బోర్లు వేస్తున్నారు. అనుమతి పత్రం లేనిదే బోరు బండిని పంపకూడదు. కానీ యజమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో బోరు బండ్లు అనేకంగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో నిత్యం బోరు వేసే యంత్రం చప్పుడు వినిపించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. వర్షాభావ పరిస్థితులకు తోడు విచ్చలవిడిగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జల మట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కో బోరు 400 నుంచి 500 అడుగుల లోతు వరకు వేస్తున్నాఫలితం ఉండడం లేదు. రోజూ 10 నుంచి 20 బోర్లకు నీళ్లు పడడం లేదని తెలుస్తోంది. చివరికి నీళ్లు పడకపోవడంతో రైతులకు అప్పులే మిగులుతున్నాయి.

రైతులు ఈ బోర్లు వేయడానికి రూ. 30 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రజల అవసరం బోరు యంత్రపు యజమానులకు కాసుల పంట కురిపిస్తోంది. తలసరి నీటి లభ్యత 15 లీటర్లకు తగ్గితేనే భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటినట్లు నిర్ధారిస్తారు. ప్రస్తుతం 40 నుంచి 60 లీటర్ల వరకు తలసరి నీటి లభ్యత ఉంది. రానున్న వేసవిలో బోరు బావులు, చేతి పంపుల నుంచి నీటిని అధికంగా వాడడం వల్ల భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా బోర్లు వేసి నష్టపోతున్న పేదరైతులకు అవగాహన కల్పిం చే చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా ఉండడంతో కలెక్టర్ స్పందించారు. 127 గ్రామాల్లో బోర్లు వేయడాన్ని మూడేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కిందిస్థాయి అధికారులు ఎంతవరకు అమలు చేస్తారు అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు