ఎల్లలు దాటిన ‘ప్రేమ’

27 May, 2018 10:14 IST|Sakshi

దత్తతకు కేరాఫ్‌ పాలమూరు శిశుగృహ 

అనాథలను అక్కున చేర్చుకుంటున్న విదేశీ దంపతులు 

స్వీడన్, ఇటలీ, మాల్టా దేశాలకు మన చిన్నారులు 

ఇప్పటివరకు 111 మందికి దక్కిన తల్లిదండ్రుల మమకారం 

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మాతృత్వం.. ఆ భావన అనిర్వచనీయం.. పెళ్లయిన ప్రతీ మహిళా తల్లి కావాలని కోరుకుంటుంది.. పుట్టిన బిడ్డలో తమ ప్రతిరూపాన్ని చూసుకుంటూ చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తారు.. అదే భావన పురుషులకూ ఉంటుంది.. అయితే, మారుతున్న జీవనశైలితో సంతాన లేమి సమస్య పలువురికి చెప్పలేని ఆవేదనను మిగులుస్తోంది.. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్న పలువురు తమకు సంతానం లేదన్న బెంగ తీర్చుకుంటున్నారు... అలాంటి వారిలో విదేశీయులు కూడా ఉండడం.. వారు పాలమూరు శిశుగృహ నుంచి పిల్లల దత్తత తీసుకుని తల్దిండ్రుల ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తుండడం విశేషం.  

అభాగ్యులు ఎందరో.. 
ఏ పాపం తెలియని పలువురు శిశువులను అమ్మ పేగు తెంచుకుని పుట్టిన మరుక్షణమే ముళ్ల పొదలపాలు చేస్తున్నారు. కళ్లు కూడా తెరవని పసికందులను అనాథలుగా మారుస్తున్నారు. కారణాలేమైనా ఇలాంటి పిల్లలెందరో తమ తప్పు లేకున్నా రోడ్డు పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఆయా సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్‌ సిబ్బంది సహకారంతో పిల్లలను శిశుగృహకు చేర్చుతున్నారు. ఇంకా కొందరు తల్లిదండ్రులు తాము పిల్లలను పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇలాం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరుకుంటున్న వారిలో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. 

వేధిస్తున్న సంతాన లేమి 
ఆధునిక జీవన విధానం, మానసిక ఒత్తిడి తదిత కారణాలు సంతాన లేమికి దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆధునిక వైద్య విధా నాలు అందుబాటులోకి వచ్చినా.. అందరికీ సంతాన భాగ్యం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సంతానం కోసం ఏళ్ల తరబడి పరితపిస్తున్న జంటలు చివరికి చట్టపరమైన దత్తతకు మొగ్గు చూపుతున్నాయి. దత్తత ప్రక్రియ ఆన్‌లైన్‌ విధా నంలో పారదర్శకంగా జరుగుతుండడంతో గడిచిన ఏడేళ్లలో పాలమూరు శిశుగృహ ద్వారా ఎందరో చిన్నారులు ‘అమ్మానాన్న’ల ఒడికి చేరా రు.

 2010లో శిశుగృహ ఏర్పాటు చేయగా, 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 111 మంది శిశువులు దత్తతకు వెళ్లగా.. అందులో నలుగురు బాలికలు విదేశాలకు వెళ్లారు. సంతాన లేమితో బాధపడుతున్న జంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తోంది. రోజుల వయçస్సు ఉన్న పసికందుల నుంచి 18 ఏళ్ల వయసున్న బాలల వరకు చట్ట ప్రకారం దత్తత తీసుకునే వీలుంది. ఎక్కువ శాతం నాలుగేళ్ల లోపు పిల్లలను దత్తత తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఏడేళ్లలో శిశుగృహ నుంచి 111 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. అందులో 93 మంది బాలికలు, 18 మంది బాలురు ఉన్నారు. 

సులువైన చట్టాలు 
రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు పలువురు విదేశీ దంపతులు ముందుకొస్తున్నారు. స్వీడన్, ఇటలీ, మాల్టా వంటి దేశాలకు చెందిన దంపతులు పిల్లలు లేరనే బాధను విడనాడి జిల్లాకు వచ్చి అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారం విదేశాలకు శిశువులను దత్తత తీసుకువెళ్లాలంటే ఎన్నో అవరోధాలు ఉంటాయని తొలుత భావించేవారు. అయితే అందుకు భిన్నంగా సులువైన చట్టాలు ఉండడంతో ఇక్కడి చిన్నారులను విదేశాలకు తీసుకువెళ్లి తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారు.  

విదేశాలకు.. 
శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. ఇందులో స్వీడన్‌కు ఒకరు, ఇటలీ దేశానికి ఇద్దరు ఆడపిల్లలు, మాల్టా దేశానికి ఒక పాప చొప్పున దత్తత ఇచ్చారు. ప్రస్తుతం స్పెయిన్‌ దేశానికి ఒక మగ, ఒక ఆడ శిశువు, మాల్టా దేశానికి ఒక పాప, అమెరికాకు ఒక పాపను దత్తత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో చట్టబద్ధంగా అన్ని అర్హతలు గుర్తించి, ప్రక్రియ పూర్తయ్యాక వీరిని ఆయా దంపతులకు అప్పగించనున్నారు. 

పారదర్శక విధానం 
సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత ప్రక్రియను పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా శిశుగృహలో 11 మంది పిల్లలను దత్తత ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా 47 మంది దంపతులు దత్తత కోరుతూ దరఖాస్తులు ఇచ్చి వేచి చూస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలుకుని దత్తత కోరుకునే జంటలకు పిల్లలను అప్పగించడం వరకు ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే స్త్రీ, శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి జాబితాలో సీనియార్టీ ప్రకారం చట్టపరమైన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను దత్తత ఇస్తున్నారు. 

దత్తతకు వెళ్లిన పిల్లలు తాము వెళ్లిన చోట ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని రెండేళ్ల పాటు సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుంది. మగ, ఆడ పిల్లలనే తేడా లేకుండా తమకంటూ సొంత వారు ఉంటే చాలు అనే భావన దత్తత కోరుకుంటున్న జంటల్లో కనిపిస్తుంది. దత్తతకు వెళ్తున్న వారిలో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఆరోగ్యం, ఆర్థిక స్థోమత కలిగి భార్యాభర్తల వయస్సు కలుపుకుని 90 ఏళ్ల నుంచి 110 ఏళ్లు కలిగిన వారికే పిల్లలను దత్తత ఇస్తారు. చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆడపిల్లలకైతే ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లల విషయంలోనైతే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. 

చట్టబద్ధంగా దత్తతకు ఓకే 
పిల్లలు కావాలనే తపనతో చాలామంది దళారుల వలలో పడి మోసపోతున్న ఘటనలు అక్కడకక్కడా చూస్తున్నాం. అయితే శిశువులను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న దంపతులు చట్టబద్ధంగానే ముందుకు సాగాలి. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకుంటే జైలుశిక్ష, జరిమానా ఉంటుంది, న్యాయపరమైన ఇబ్బందులు సైతం ఎదురవుతాయి. సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా) వెబ్‌సైట్‌ ద్వారా లేదా మా కార్యాలయంలో సంప్రదించడం ద్వారా దత్తత నిబంధనలు, వివరాలు తీసుకోవచ్చు.         
– జి.శంకరాచారి, డీడబ్ల్యూఓ, మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు