జనం నెత్తిన రుద్దేస్తున్నారు..!

18 Oct, 2019 12:26 IST|Sakshi

నగరంలో నాశిరకం మందుల వినియోగం

ఇన్‌పేషెంట్లకు విచ్చల విడిగా గడువు సమీపించిన మందులు

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యం తూతూ మంత్రంగా తనిఖీలు

ఫిర్యాదులకు స్పందించని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నాశిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. తక్కువ ధరకు లభించే జనరిక్‌ మెడిసిన్, గడువు ముగిసిన ఖరీదైన బ్రాండెడ్‌ మందులకు కొత్తగా లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారు. వీటిని వేసుకున్న వారికి వ్యాధి తగ్గక పోగా మరింత ముదురుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్‌సేట్‌ మెడికల్‌ దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి గడువు ముగిసిన, నాశిరకం మందులను గుర్తించి, విక్రయదారులపై కేసులు నమోదు చేయాల్సిన డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతుండటతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేన్సర్, పక్షవాతం, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషెంట్లకు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగుల బంధువులు ఎవరైనా దీనిని గుర్తించి, ఫిర్యాదు చేయాలని భావించి డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లకు ఫోన్‌ చేస్తే...వారిలో పలువరు అసలు ఫోన్లే ఎత్తడం లేదు. డీసీఏ అధికారుల వైఖరితో విసుగుచెందిన రోగులు, వారి బంధువులు ఏసీబీని ఆశ్రయిస్తుండటం విశేషం. ఇటీవల డీఐ లక్ష్మిఓ రక్తనిధి కేంద్రం నుంచి నగలరూపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే.    

తనిఖీలకు వచ్చి...
రాష్ట్ర వ్యాప్తంగా 500పైగా మందుల తయారీ కంపెనీలు ఉన్నాయి. 27వేలకు పైగా హోల్‌సేల్, రిటైల్‌ దుఖానాలు కొనసాగుతున్నాయి. ఇందులో 80 శాతం కంపెనీలు, హో ల్‌సేల్‌ దుఖానాలు గ్రేటర్‌ పరిధిలోనే ఉన్నాయి. వాస్తవానికి తుది గడువుకు మూడు నెలల ముందే స్టోర్‌లో నిల్వ ఉన్న మందులను గుర్తించి ఆయా ఔషధ కంపెనీలకు తిప్పి పంపాల్సి ఉంది. అయితే నగరంలోని కొన్ని ఆస్పత్రుల్లోని మందుల దుఖానాలు ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అమాయక ఇన్‌పేషంట్లకు గుట్టుగా ఈ మందులను వాడుతున్నట్లు తెలిసింది. ఓపీ రోగులు కొనుగోలు చేసిన మందులు బయట ఎవరైనా గుర్తించే ప్రమాదం ఉండటంతో ఇన్‌పేషెంట్లకే వాటిని వినియోగిస్తున్నారు. దీంతో సర్జరీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో నయం కావాల్సి గాయం వారం పదిరోజులైనా మానకపోవడం, వ్యాధి తీవ్రత తగ్గక పోవడానికి ఇదే కారణమని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు ప్రతి మూడు నెలలకోసారి ఆయా దుఖానాల్లో తనిఖీలు నిర్వహించిగడువు ముగిసిన, సమీపించిన మందులను ముందే గుర్తించి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే తనిఖీలకు వెళ్తున్న ఇన్‌స్పెక్టర్లలో పలువురుఫార్మసీల ముఖం చూడకుండానే బయటికి వెళ్లిపోతున్నట్లు తెలిసింది.  

తనిఖీలు ముమ్మరం చేశాం
నాశీరకం మందులు అమ్ముతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్‌సేల్‌ దుఖానాలపై డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం ప్రత్యేంగా దృష్టిసారించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నాశిరకం మందుల విక్రయాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. తనిఖీల విషయంలో డీఐలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో 20,200 దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి, 5700 ఉల్లంఘన లు గుర్తించాం. 20 నాశిరకం మందులను గుర్తించాం. లైసెన్స్‌ లేకుండా మందులు అమ్ముతున్న 64 దుఖానాలను సీజ్‌ చేశాం. వీరిలో 24 మందికి ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి.  2019లో ఇప్పటి వరకు 13370 తనిఖీలు నిర్వ హించాం. 4780 ఉల్లంఘనలు, తొమ్మిది నాశిరకం మందులను గుర్తించి ఆ మేరకు కేసులు నమోదు చేశాం. లైసెన్సులు లేకుండా మందులు అమ్ముతున్న 42 మందుల దుఖానాలను సీజ్‌ చేశాం. 32 మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. వీటిలో గడువు ముగిసిన మందులు నిల్వ చేయడం, కనీస అర్హత లేని నాన్‌ఫార్మసిస్ట్‌ మందులు విక్రయిస్తుండటం, మందులు కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించడం వంటి ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయి.  –వెంకటేశ్వర్లు, జాయింట్‌ డైరెక్టర్, డీసీఏ 

మరిన్ని వార్తలు