కల్లు..కల్తీఫుల్లు!

19 Nov, 2014 23:17 IST|Sakshi

 జోగిపేట: కల్తీకల్లుతో జోగిపేట తూలిపోతోంది. పొద్దునే చాయ్ తగ్గినట్టుగా చాలామంది కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్లుకు బానిసలైన వారు కొన్నిరోజుల పాటు ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిన సమయంలో తమ వెంట 20, 30 లీటర్ల కల్లును తీసుకువెళ్తున్నారు. అలా కల్లును తీసుకెళ్లనివారు ఒక్కసారిగా కల్లు తాగడం మానేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అందువల్లే కల్లుకు బానిసలైనవారు నీళ్ల తాగకుండా ఉండగలం కానీ, కల్లు లేకుండా ఉండలేమంటున్నారు. వీరి వ్యసనాన్ని ఆసరాగా తీసుకున్న కల్లు కాంట్రాక్టర్లు పది లీటర్ల కల్లులో మత్తుపదార్థాలు కలిపి వంద లీటర్లు చేసేస్తున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

 కల్తీ ఎలా జరుగుతుందంటే...
 అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లోని ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లును డిపోలకు తరలిస్తారు. డిపోల్లో సహజసిద్ధంగా లభించిన కల్లులో డైజోఫాం, అల్ఫాజోలం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఆ కల్లును లారీలు, ఇతర వాహనాల్లో గ్రామాలకు రవాణా చేస్తారు. రెండు మండలాలకు చెందిన మెజార్టీ గీత కార్మిక సంఘాలు వారు.. ప్రతి సంవత్సరం  జోగిపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు.

గీత కార్మికుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లునే సరఫరా చేయాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్ కాసులకోసం కక్కుర్తిపడి మత్తుపదార్థాలను కల్లులో కలిపి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. చాలా చోట్ల లెసైన్స్ లేని దుకాణాలు సైతం దర్జాగా కల్లును విక్రయిస్తున్నా, అధికారులు అమ్యామ్యాలతో కళ్లుమూసేసుకున్నారు.

 శాంపిల్స్ సేకరణ..అదే తంతు
 ఎక్సైజ్ శాఖ తమ పరిధిలోని దుకాణాలు, కల్లు డిపోల్లోని కల్లును ప్రతి నెల 20 శాంపిల్స్‌ను తీసి నిజామాబాద్‌లోని రీజినల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబరేటరీకి పంపుతారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటారు. కానీ లేబరేటరీ నుంచే వచ్చే రిపోర్టులో కల్తీ శాతం నిల్ అని వస్తోంది. 2013-14 సంవత్సరానికి గాను జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 250 నుంచి 300 వరకు కల్లు శాంపిల్స్‌ను లేబరేటరీకి పంపగా, అందులో 20 వరకు మాత్రమే కల్తీ అని ఫలితం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఆ 20 దుకాణాలు కూడా గ్రామీణ ప్రాంతంలోని  లెసైన్స్‌లేని దుకాణాలు కావడం విశేషం. ఇక మిగతా దుకాణాల్లో కల్లు కల్తీకావడం లేదా అంటే..ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. వాస్తవానికి దాదాపుగా ప్రతి కల్లు దుకాణంలోనూ కల్తీ దందా సాగుతోంది. కానీ రిపోర్టుల్లో మాత్రం కల్తీ నిల్ అని వస్తోంది. ఇలా రిపోర్టు వచ్చేందుకు పెద్దమొత్తంలో నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 వచ్చేది కొంత..తయారయ్యేది కొండంత
 అల్లాదుర్గం మండలం ఫరిధిలోని గడిపెద్దాపూర్, వట్‌పల్లి, బహిరన్‌దిబ్బ, నాగులపల్లి గ్రామాలలోని ఈత చెట్ట నుంచి కల్లును అన్నాసాగర్, అందోలు డిపోలకు తరలిస్తారు. ఈ డిపోల్లో తయారైన కల్లును అందోలు, పుల్కల్ మండలాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తారు. కేవలం రెండు ప్రాంతాల కోసం మాత్రమే సరిపోయే కల్లును కల్తీ చేసి మిగతా గ్రామాలకు సైతం పంపిణీ చేస్తున్నారు. వారానికి 800 లీటర్ల కల్లు మాత్రమే ఈత వనాల నుంచి రవాణా అవుతున్నట్లు సమాచారం.

కానీ జోగిపేట, అందోలు సొసైటీలకు చెందిన 8 కల్లు దుకాణాలతో పాటు పుల్కల్ మండలంలోని 20 గ్రామాలలోని కల్లు దుకాణాలకు ఈ రెండు డిపోల ద్వారా పంపిణీ చేస్తారు. కల్లు డిపోల్లో 30 శాతం ఎక్కువగా కల్లు మిగులుతున్నట్లయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇతర సొసైటీల వారు లిఖిత పూర్వకంగా కోరితే ఆ గ్రామాలకు కల్లును సరఫరా చేయాలని ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. ఈత వనాల నుంచి వచ్చేది తక్కువే అయినా మత్తు పదార్థాలతో కల్తీచేసి వందల లీటర్లు సర ఫరా చేస్తున్నారు.

 ఎక్సైజ్ సార్లకు ఏమీ తెలియదట!
 కల్లునుకల్తీ చేసి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నా అబ్బేం అదేం లేదంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. జోగిపేటకు సుమారుగా 25 కి.మీ దూరంలో ఉన్న ఈత చెట్ల నుంచి రెండు రోజులకోసారి స్వచ్ఛమైన కల్లును అందోలు, అన్నాసాగర్ డిపోలకు తరలిస్తారు. ఈ కల్లులో నీళ్లు, చక్కెరతోపాటు అల్ఫాజోలం, డైజోఫాం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఈ విషయం ప్రపంచమంతా తెలిసినా ఎక్సైజ్ అధికారులకు మాత్రం తెలియనట్లే నటిస్తున్నారు. కొన్ని చోట్ల వారికళ్లముందే ఈ తంతు జరుగుతున్నా పట్టించుకున్న పాపానపోరు. కల్తీ కల్లు సేవించి ఎంతో మంది అనారోగ్యానికి గురై మరణించినా పట్టించుకోవడం లేదు. దీంతో కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా