పార్శిల్‌ పరేషాన్‌

21 Aug, 2019 11:46 IST|Sakshi
శాంపిళ్లను తీసుకెళ్తున్న క్లూస్‌ టీం సిబ్బంది

పోస్టల్‌ ద్వారా వీఐపీలకు కలుషిత జలాలు

సికింద్రాబాద్‌ పోస్టాఫీస్‌లో కలకలం

రాంగోపాల్‌పేట్‌: తమ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది వినూత్న రీతిలో తీవ్ర నిరసనకు దిగారు. కలుషిత జలాలను ప్రభుత్వ పెద్దలు, వీవీఐపీలకు పార్శిల్‌ చేసి కలకలం సృష్టించారు. మంగళవారం సికింద్రాబాద్‌ పోస్టాఫీస్‌లో ఈ ఘటన వెలుగులోకి  వచ్చింది. అయితే, పోలీసులు, ఇటు పోస్టాఫీస్‌ వర్గాలు ఈ విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్‌ నుంచి పార్శిళ్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి, కొందరు మంత్రుల చిరునామాతో పార్శిళ్లు వచ్చాయి. ఉస్మానియా నుంచి వాటిని ప్రధాన పోస్టాఫీస్‌ అయిన సికింద్రాబాద్‌కు వచ్చాయి. మంగళవారం ఆ పార్శిళ్ల నుంచి వాసన వస్తుండటంతో పోస్టాఫీస్‌ వర్గాలకు అనుమానం వచ్చి మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు, క్లూస్‌ టీం అక్కడికి చేరుకుని పార్శిళ్లను విప్పి చూడగా అందులో కలుషిత జలాలు కనిపించాయి. అవి కలుషిత జలాలా.. మరేదైనా కెమికల్‌ కలిపారా.. అనేది తెలుసుకునేందు క్లూస్‌ టీం శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వీటిని ఎవరు పంపించారు.. ఏ చిరునామాతో వచ్చాయనే వివరాలు లేవని  తెలిసింది.  

మురుగు నీటి సమస్యపై..
ఉస్మానియా వర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్‌ పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్శిళ్లతో పాటు తమ ప్రాంతంలో ఉండే కలుషిత జలాల సమస్య ఎవరు పట్టించుకోవడం లేదని ఘాటైన లేఖలు కూడా జతచేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి ఫిర్యాదు  అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ జయపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కొన్ని పార్శిళ్లపై పోస్టాఫీస్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేయడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని వెళ్లి పరిశీలించామన్నారు.  

మరిన్ని వార్తలు