ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తున్నారా.. జాగ్రత్త!

14 Apr, 2018 03:04 IST|Sakshi

తాజా ఫలితాలే పరిగణనలోకి..

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో తాజా ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫెయిలైతే అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాసైనా కూడా ఫెయిల్‌ అయినట్లే పరిగణిస్తారు.

ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఇంటర్‌ బోర్డు అధికారులు సూచించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవచ్చు. సాధారణ ఫీజుతో పాటు ప్రతి పేపర్‌కు రూ.150 చొప్పున చెల్లించాలి.

ద్వితీయ సంవత్సర విద్యార్థులు..
2016 తర్వాత ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు రెండేళ్లలో రెండు సార్లు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవచ్చు. ద్వితీయ సంవత్సర పేపర్లను, ప్రాక్టికల్స్‌ రాసినా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పేపర్లలో ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే.. గతంలో వచ్చిన మార్కులనైనా ఉంచుకోవచ్చు. తాజా మార్కులనైనా ఎంచుకోవచ్చు. కానీ ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చాయని వాటిని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు.

జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియట్‌ మార్కులకు 40 శాతం కలిపి) ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

ఇక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్‌–20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డులో 75 శాతం మార్కులు (జనరల్‌ విద్యార్థులు) సాధించి ఉంటే చాలు. 

మరిన్ని వార్తలు