ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

18 Jul, 2019 02:36 IST|Sakshi
బుధవారం నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎన్‌పీఏ నూతన డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌.

ట్రైనీ ఐపీఎస్‌లకు అధునాతన శిక్షణ

ఎన్‌పీఏ నూతన డైరెక్టర్‌ అభయ్‌ వెల్లడి..  

సాక్షి, హైదరాబాద్‌: ట్రైనీ ఐపీఎస్‌ అధికారులకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానని నేషనల్‌ పోలీస్‌ అకాడమీ నూతన డైరెక్టర్, డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ అన్నారు. బుధవారం ఉదయం అకాడమీ అధికారుల ఘనస్వాగతం అనంతరం నూతన డైరెక్టర్‌గా అభయ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌ ఒడిశా కేడర్‌కి చెందినవారు. అనంతరం అభయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భావి ఐపీఎస్‌ ఆఫీసర్లను తీర్చిదిద్దే అకాడమీ బాధ్యతలను స్వీకరించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాను గతంలో సీబీఐ (బ్యాండ్‌ఫ్రాడ్‌), సీఆర్‌పీఎఫ్, నార్కోటిక్స్‌ బ్యూరోలో విధులు నిర్వహించానన్నారు.

దేశంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక అకాడమీలో ప్రస్తుతం 350 మంది ఆఫీసర్లు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. వీరిలో 147 మంది ఆఫీసర్లు ఫేజ్‌–1, మరో 121 మంది ఫేజ్‌–2 ట్రైనింగ్‌లో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిలో ఫారిన్‌ ఆఫీసర్లు కూడా ఉన్నారని వివరించారు. గడిచిన పదేళ్లలో అకాడమీలో కాలానుగుణంగా శిక్షణ విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు.  సీబీఐ, ఎన్‌ఐఏలో కేసు దర్యాప్తు తర్వాత న్యాయ విచారణను పర్యవేక్షించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా ఆధునిక పద్ధతిలో వర్చువల్‌ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దర్యాప్తు విధానంలో (ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు) అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

వర్చువల్‌ తరగతులు అంటే..? 
వర్చువల్‌ తరగతులు అనగా కంప్యూటర్‌ సాయంతో భారీ తెరలను ఏర్పాటు చేసి టార్గెట్‌ను ఛేదించే ఒక ఆధునిక విధానం. చాలామంది పిల్లలు ప్లే స్టేషన్‌ పేరిట వివిధ గేమ్స్‌ని నిజంగా ఆడిన అనుభూతిని పొందినట్లే.. ఉగ్రవాద దాడి జరిగినపుడు శత్రువుపై ఎలా దాడి చేయాలి? ఎటునుంచి ముప్పు పొంచి ఉంది? క్షణాల్లో ఎలా దాడి చేయాలి? సురక్షితంగా ఎలా రావాలి? అన్న విషయాలపై శిక్షణ ఇస్తారు. 

మరిన్ని వార్తలు