ఆంధ్రా పాలనలోనే ఆర్టిస్టులకు గౌరవం: ఎక్కా యాదగిరి

29 Sep, 2018 01:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఆర్టిస్టులు.. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్టిస్టులు కన్పించట్లేదు. ఆంధ్రోళ్ల పాలనలోనే గౌరవ, మర్యాదలు ఉండేవి’ అని అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరి తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పాలకుల పాలనలో అవార్డులు, ప్రోత్సాహకాలు ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ సర్కారు ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా శిల్పులకు, చిత్రకారులకు ఏం చేసిందని ప్రశ్నించారు.

తమకు నిలువ నీడలేదని, పెద్ద పెద్ద ఆర్టిస్టులను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఆర్టిస్టులంతా చెట్టుకొకరం.. పుట్టకొకరం అయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ కల్పించుకొని పెద్దలు సంయమనం వహించాలని కోరారు. మీ సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. లలితకళల అకాడమీ ఏర్పాటు కావాల్సి ఉందని భవిష్యత్తులో ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు.  
 

మరిన్ని వార్తలు