రామప్ప.. ‘ప్రపంచ’ గొప్పే!

11 Nov, 2017 03:22 IST|Sakshi
రామప్ప దేవాలయంలో అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్‌ చూడామణి బృందం (ఫైల్‌)

తేల్చిన ప్రొఫెసర్‌ చూడామణి కమిటీ

యునెస్కో గుర్తింపు పొందిన హంపి కంటే ప్రత్యేకమైన నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

మరో పది రోజుల్లో యునెస్కోకు అనుబంధ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: అద్భుత నిర్మాణ కౌశలంతో అలరారుతున్న రామప్ప దేవాలయం ప్రపంచ స్థాయి ప్రత్యేక నిర్మాణమని నిపుణుల కమిటీ తేల్చింది. ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆధ్వర్యంలోని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకునేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని రూఢీ చేసింది. నిర్మాణంలో ఉపయోగించిన ఇంజనీరింగ్‌ నైపుణ్యం, తీర్చిదిద్దిన శిల్పాల పనితనం, ప్రత్యేక నృత్యరీతులు రూపొందేందుకు ఆ శిల్పాలు ప్రేరణ కావటం తదితరాల ఆధారంగా ప్రత్యేకను సంతరించుకున్న నిర్మాణమని తేల్చింది.

ప్రఖ్యాత నర్తకి, ఆర్కిటెక్ట్, యునెస్కో కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ చూడామణి నందగోపాల్‌ ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. యునెస్కో గుర్తింపు పొందిన సమకాలీన నిర్మాణాలతో పోలిస్తే రామప్ప మెరుగ్గా ఉందని, దీని నిర్మాణానికి వినియోగించిన ఇంజనీరింగ్‌ మెళకువలు, నిర్మాణ శైలి, వాడిన పరిజ్ఞానం, కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కడం తదితరాలన్నీ ప్రపంచ స్థాయి ప్రత్యేకతలుగా ఆమె అభివర్ణించారు. దీన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో పది రోజుల్లో ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయానికి నివేదికను అందజేయనుంది. ఇప్పటికే పెండింగులో ఉన్న రామప్ప డోషియర్‌ (దరఖాస్తు)కు దీన్ని జతచేసి ప్రపంచ వారసత్వ హోదా కేటాయించే విషయాన్ని యునెస్కో పరిశీలించనుంది. ఈసారి యునెస్కో గుర్తింపు వస్తుందని ప్రభుత్వం భరోసాతో ఉండటం విశేషం.

ఏడు నెలల క్రితమే దరఖాస్తు
గోల్కొండ, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ల ప్రతిపాదనలను యునెస్కో తిరస్కరించటంతో రాష్ట్ర ప్రభుత్వం రామప్ప దేవాలయంపై దృష్టి సారించి ఏడు నెలల క్రితం దరఖాస్తు చేసింది. దీన్ని పరిశీలించిన యునెస్కో.. రామప్ప మందిర నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఎలా ప్రత్యేకతను సంతరించుకుందో తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం నిపుణులను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు నిష్ణాతులతో చర్చించి చివరకు ప్రొఫెసర్‌ చూడామణి నందగోపాల్‌ను ఎంపిక చేశారు. ఆమె గతంలో కర్ణాటకలోని హంపి, హాలెబీడు హొయసాలేశ్వర మందిరం, తంజావూరు బృహదీశ్వరాలయం వంటి వాటిపై సమగ్ర అధ్యయనం చేసిన అనుభవశాలి. డాన్స్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ విద్య, ఆర్ట్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ సౌమ్య మంజునాథ్, విశ్రాంత పురావస్తు ఉన్నతాధికారి రంగాచార్యులతో కలసి గత ఆగస్టులో రామప్ప మందిరంపై ఆమె అధ్యయనం చేశారు. 

అధ్యయనం వివరాలివీ..
- యునెస్కో కోరిన అంశాల ఆధారంగా చూడామణి పరిశీలన సాగింది.
- హంపి, హాలెబీడు, తంజా వూరు నిర్మాణాలతో పోల్చి వాటితో రామప్ప దేవాలయం ఏరకంగా ప్రత్యేకమైందో గుర్తించారు. 
- హంపి, హాలెబీడు, తంజావూరులలో శిల్పాలను సిస్ట్‌ రాతిపై చెక్కారు. అది మెత్తరకం రాయి కావటంతో శిల్పాలు చెక్కడం ఇబ్బందిగా ఉండదు. కానీ రామప్ప దేవాలయంలోని శిల్పాలను చాలా కఠినంగా ఉండే డోలరైట్‌ రాతిపై చెక్కారు.
- శిల్పాలు అద్దం తరహాలో నునుపు, మెరుపు తేలాలా ఉండటం పనితనంలో ప్రత్యేకతను తెలుపుతోంది. శిల్పాల కార్వింగ్‌లో చిన్నచిన్న వివరాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని డిజైన్లలో వెంట్రుక దూరేంత సన్నటి సందులు ఏర్పరచారు.
- వేణుగోపాల స్వామి శిల్పంపై మీటినప్పుడు సప్తస్వరాలు పలకటం నాటి పరిజ్ఞానానికి నిదర్శనం.
- నృత్య భంగిమల్లోని శిల్పాలు ప్రత్యేక నృత్య రీతులు ఏర్పడేందుకు ప్రేరణగా నిలిచిన దాఖలాలున్నాయి.          
- గణపతి దేవుడి బావమరిది జాయప సేనాని 1250లో రచించిన నృత్య రత్నావళి గ్రంథంలోని వర్ణనకు ఈ ఆలయ శిల్పాలే ప్రేరణ అని గుర్తించారు.
- పేరిణి శివతాండవాన్ని నటరాజ రామకృష్ణ రూపకల్పన చేయటానికి ఈ శిల్పాలే ప్రేరణగా నిలిచిన తీరును గుర్తించారు.
- ఈ మందిర నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి. ఎంత తేలికైనవో, అంత కఠినమైనవి. ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా ఇటుకలు ఉపయోగించిన దాఖలాలు లేవని గుర్తించారు.

మరిన్ని వార్తలు