డిసెంబర్‌లో ఏఎఫ్‌ఆర్‌సీ నోటిఫికేషన్‌!

26 Oct, 2018 01:56 IST|Sakshi

వచ్చే మూడేళ్ల ఫీజుల ఖరారుకు చర్యలు చేపట్టాలని యోచన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్ల ఫీజులను ఖరారు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగియడంతో..2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సులకు ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటివరకు ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా పని చేసిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి పదవీకాలం గత డిసెంబర్‌తోనే ముగియగా, ఇపుడు కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ మినహా మిగతా కమిటీ సభ్యులంతా ఉన్నారు. దీంతో ఆ కమిటీ నేతృత్వంలో నోటిఫికేషన్‌ జారీ చేసి, మూడేళ్లలో కాలేజీల ఆదాయ వ్యయాలు, ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు స్వీకరించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా ఉంది. సాధారణంగా ముగ్గురు హైకోర్టు రిటైర్డ్‌ జడీ ్జల పేర్లను ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తే ఆయన అందులోని ఏదో ఒక పేరును ఖరారు చేస్తారు.  

>
మరిన్ని వార్తలు