నేటి నుంచి రైళ్లు షురూ

1 Jun, 2020 02:30 IST|Sakshi

70 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత పట్టాలెక్కుతున్న ప్రయాణికుల రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం తర్వాత రైళ్లు మళ్లీ పరుగు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికుల రైళ్లు ప్రారంభమవుతున్నాయి. వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, కొన్ని రాజధాని స్పెషల్‌ రైళ్లు కాకుండా టైం టేబుల్‌లోని షెడ్యూల్‌ రైళ్లు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా, దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి 8 రైళ్లు (9వ రైలున్నా.. అది నాందెడ్‌ వాసులకు అందుబాటులో ఉంటుంది) ప్రారంభమవుతున్నాయి.

ఇవికాక ఇతర జోన్లకు చెంది దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించే మ రో 5 రైళ్లు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబా టులో ఉండనున్నాయి. రైళ్లలో కరోనా నిబంధనలు పాటించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైనా.. రైళ్లలో సీట్ల మధ్య దూరం ఉండని నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణానికి సిద్ధం కాకపోవటం మంచిద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తోటి ప్రయాణికుల్లో ఎవరైనా అనారోగ్య లక్షణా లతో ఉన్నా, తోటి ప్రయాణికులు మాస్క్‌ ధరించకున్నా  ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు: రైళ్ల పున:ప్రయాణం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు కానుంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఈ రైలు నాంపల్లి స్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్, మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, అనంతరం ముంబై వెళ్లే హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్, తర్వాత హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సాయంత్రం నిజామాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, తర్వాత విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరతాయి.

నెల రిజర్వేషన్‌ ఫుల్‌: ఇప్పటికే నెలకు సంబంధించిన బెర్తులన్నీ ఫుల్‌ అయ్యాయి. తొలుత ఈ రైళ్లకు నెల రోజుల రిజ ర్వేషన్‌ మాత్రమే కల్పించారు. ఆ తర్వాత 120 రోజులకు పెం చారు. మిగతా రోజులకూ రిజర్వేషన్‌ వేగంగా పూర్తవుతోంది. నాలుగు రైళ్లకే కొన్ని సీట్లు ఖాళీ ఉండగా, మిగతావి దాదాపు పూర్తయ్యాయి. ఈ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్‌ ప్రయాణా నికే అవకాశం కల్పించారు. దీంతో అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండే జనరల్‌ బోగీల్లో కూర్చుని ప్రయాణించేలా సీట్లు ఏర్పాటు చేశారు. వాటికి కూడా రిజర్వేషన్‌ టికెట్లనే అందుబాటులో ఉంచారు.

గంటన్నర ముందే..: రైలు బయలుదేరటానికి గంటన్నర ముందే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రయాణికుల్లో కరోనా లక్షణాలున్నా, ఇతరత్రా అనారోగ్యంతో ఉన్నా అనుమతించరు. ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనింగ్‌ ద్వారా పరీక్షిస్తారు.  కన్ఫర్మ్‌ టికెట్‌ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ప్రయాణికుల వెంట వచ్చే వారు బయటే ఉండాల్సి ఉంటుంది. రైళ్లలో భోజనం అందించరు. ప్రయాణికులు ఇంటి నుంచే నీళ్లు, భోజనం తెచ్చుకోవటమే శ్రేయస్కరం. బెర్తులపై పడుకునేవారు శుభ్రమైన బె డ్‌షీట్‌ తెచ్చుకోవటం మంచిది. వృ ద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణానికి దూరంగా ఉంటే మంచిది. కూలీ లు అందుబాటులో ఉండనందున తక్కువ లగేజీతో వెళ్లటం మం చి ది. స్మార్ట్‌ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..
హైదరాబాద్‌–ముంబై సీఎస్‌టీ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–దానాపూర్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్‌–తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–నిజాముద్దీన్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఇతర జోన్ల రైళ్లు..
ముంబైæ–భువనేశ్వర్, ముంబై–బెంగళూరు, దానాపూర్‌–బెంగళూరు, న్యూఢిల్లీ–విశాఖపట్నం, హౌరా–యశ్వంతపూర్‌. 

మరిన్ని వార్తలు