డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు

5 Aug, 2019 11:28 IST|Sakshi
ఆస్పత్రి ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న బంధువులు

‘పేట’లో దారుణం 

బాలింత మృతి విషయం చెప్పని వైద్యసిబ్బంది

ట్రీట్‌మెంట్‌ చేస్తున్నట్టు నాలుగు గంటల పాటు డ్రామా 

ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు

సాక్షి, సూర్యాపేట: వైద్యుడు దేవుడితో సమానమంటారు.. కానీ కొందరు వైద్యులు డబ్బులకు కక్కుర్తిపడి వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు..  చనిపోయిన విషయం చెప్పకుండా.. ట్రీట్‌మెంట్‌ చేస్తున్నట్టు తీసిన ఓ తెలుగు సినిమాలోని సీన్‌ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పునరావృతమైంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..జనగాం జిల్లా కొడకండ్ల మండలం హక్యతండాకు చెందిన గుగులోతు సరిత(28)కు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం  శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

 ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో వైద్యులు ఆపరేషన్‌ చేయడంతో సరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య సిబ్బంది ఆపరేన్‌ గది నుంచి శిశువును బయటికి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సరితను బయటికి తీసుకరాకపోవడంతో వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యాన్ని బంధువులు నిలదీశారు. వైద్యులు మాత్రం ఎవరికేం కాలేదంటూ గంటల తరబడి మృతి చెందిన సరితను చూపకుండా ఠాగూర్‌ మూవి సీన్‌ను తలపించే విధంగా వ్యవహరించారు. మొత్తం డబ్బులు కడితేనే సరితను డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆ మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత సరిత మృతిచెందిందని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఆపరేషన్‌ వికటించే చనిపోయిన సరితను ఆపరేషన్‌ థియేటర్‌లో ఉంచి డబ్బులు చెల్లించాక మృతి చెం దిందని చెప్పడమేం టని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను సద్దు మణిగింపచేశారు. అయితే ఇదే ఆస్పత్రిలో ఇటీవల బాలింతల మృతిచెందుతుండడంతో గర్భిణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో కూడా ఆసుపత్రిలో వైద్యురాలి అందుబాటులో లేకున్నా అడ్మిట్‌ చేయించుకొని గర్భిణి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు