జరిగేది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. 

24 Apr, 2020 02:25 IST|Sakshi

చరిత్రను మలుపు తిప్పే సంఘటనలను ప్రస్తావిస్తూ.. అంతకుముందు.. ఆ తర్వాత అన్నట్లు చెబుతుంటాం.. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం.. మన జీవితాలు కూడా కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్నట్లు మారబోతున్నాయి. సామాజిక, ఆర్థిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవెలా ఉండవచ్చన్నది ఓసారి భవిష్యత్తులోకి వెళ్లి చూసి వద్దామా..  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

డిజిటల్‌ సేవలు, ఈ–కామర్స్‌కు జై 
ఇప్పటికే కాంటాక్ట్‌ లెస్‌ డెలివరీలు అన్నవి పెరిగాయి.. కరోనా అనంతర పరిస్థితుల్లో ఇవి మరింతగా పెరుగుతాయి. కాంటాక్ట్‌ లెస్‌ గూడ్స్‌ సేవలు,  డిజిటల్, ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్, ఫుడ్‌ డెలివరీ తదితర కంపెనీలు వృద్ధి చెందు తాయి. అదేవిధంగా సోషల్‌ మీడియా ప్రభావం కూడా పెరుగుతుంది. ప్రకటనల మీద పెట్టే ఖర్చును చాలా కంపెనీలు తగ్గించుకుంటాయి.

ఉద్యోగాల్లో యాంత్రీకరణ.. 
యాంత్రీకరణ పెరుగుతుంది. కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు. ఇంట్లో నుంచే ఉద్యోగం చేసేలా చాలా కార్యకలాపాలు ఉండొచ్చు. ఇవన్నీ ఔట్‌సోర్సింగ్‌లో తక్కువ వ్యయంతో ప్రాజెక్టులు పూర్తి చేసే దేశాల్లోని నిపుణులకు లభించే అవకాశముంది.  

టెలి మెడిసిన్‌కు గిరాకీ 
ఇంటికి వచ్చి టెస్టులు చేసే వ్యవస్థ ఇప్పటికే ఉంది.. ఇది మరింతగా పెరుగుతుంది. టెలిమెడిసిన్, పరిశోధనలు, బయోటెక్, హెల్త్‌కేర్‌ వ్యవస్థలకు నిధులు బాగా పెరుగుతాయి.  
మరో వలస సంక్షోభం.. 
ఆంక్షలు ఎత్తేసిన తర్వాత హెల్త్‌కేర్‌ వ్యవస్థ సరిగా లేని దేశాల నుంచి మెరుగైన మంచి ఆరోగ్య వ్యవస్థ ఉన్న యూరప్‌ వంటి దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. ధనిక దేశాలు నైపుణ్యం ఉన్న వారిని అనుమతించే అవకాశం ఉంది.  

నిఘా, ఆంక్షలు పెరగొచ్చు.. 
ప్రస్తుతం కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అత్యవసర అధికారాలు ప్రదర్శిస్తున్నారు. కరోనా తర్వాత మరింత నిఘా పెరగొచ్చు. దేశ, రాష్ట్ర సరిహద్దుల వెంబడి బయోమెట్రిక్‌ స్క్రీనింగ్‌ జరపొచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లే పరిస్థితి రావొచ్చు.  

ప్రాధాన్యాలు మారుతాయి
కరోనా ఎంతటి మహమ్మారో ప్రపంచానికి తెలిసొచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌ల నుంచి మానవాళిని కాపాడటానికి ప్రపంచ దేశాల నేతలు దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తారు. పర్యావరణ పరిరక్షణ అన్నది ప్రాధాన్యంగా మారే అవకాశముంది.  

మరిన్ని వార్తలు