గవర్నర్‌తో చర్చించాకే..

13 Mar, 2014 04:20 IST|Sakshi

అధికార నివాసాలపై మహంతి నిర్ణయం
ప్రస్తుత అసెంబ్లీలోనే ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రం సమావేశాలు
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగం కన్వీనర్‌గా ఐఏఎస్ పి.వి.రమేశ్

 
 సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికార నివాసాలు కేటాయింపు, ఢిల్లీలోని అంధ్రప్రదేశ్ భవనం, ఇద్దరు సీఎస్‌లకు, ఇద్దరు డీజీపీలకు అధికార నివాసాలు కేటాయింపు సున్నితమైన అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై గవర్నర్ నరసింహన్‌తో చర్చించిన తరువాత ఆయన సలహాలు, సూచనలమేరకు వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్స్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసం, క్యాంపు కార్యాలయం ఉంది. దీన్ని ఇప్పుడు తెలంగాణ  సీఎంకు కేటాయించాలో, సీమాంధ్ర ముఖ్యమంత్రికి కేటాయించాలో అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
 
  సీఎంకి ఒక అధికార నివాసం, క్యాంపు కార్యాల యం ఉండాలని భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా గ్రీన్‌ల్యాండ్స్‌లో వాటిని నిర్మిం చారు. ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎంకు గ్రీన్‌ల్యాండ్‌లోని అధికార నివాసం కేటాయిస్తే మరో రాష్ట్ర సీఎంకు అధికార నివాసంగా ఏది కేటాయించాలనేది సమస్యగా మారింది. అలాగే ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, ఇద్దరు డీజీపీలకు అధికార నివాసాలను, సచివాలయంలో ఇద్దరికీ అధికారిక కార్యాలయాలను కేటాయించాలి. ఉమ్మడి రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాలను ప్రస్తుత అసెంబ్లీలోనే ఒకరు తరువాత ఒకరు నిర్వహించుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నివేదికను సమర్పించారు.  కాగా సచివాలయంలోని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగం కన్వీనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ను నియమించాలని సీఎస్ నిర్ణయించారు. ఈ విభాగంలో ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, బి.వెంకటేశం, జయేష్ రంజన్ పనిచేస్తారు. ఈ విభాగంలో డిప్యుటీ కార్యదర్శిగా ఎల్. సుబ్బారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు