ఎన్నాళ్లకెన్నాళ్లకు !

19 Oct, 2014 03:43 IST|Sakshi
ఎన్నాళ్లకెన్నాళ్లకు !

జడ్చర్ల:
 పదేళ్ల తరువాత జడ్చర్లకు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రం    మంజూరైంది. సోమవారం నుండి ఇక్కడ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని బాదేపల్లి మార్కెట్‌యార్డు కార్యదర్శి అనంతయ్య తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఈ కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, దశాబ్దకాలంగా జడ్చర్లలో సీసీఐ కొనుగోలుకేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ఏనాడూ ప్రభుత్వం స్పందించలేదు.

2004లో బాదేపల్లి మార్కెట్‌యార్డులో సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలుచేశారు. అయితే అప్పట్లో మద్దతుధరలు రాకపోవడంతో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేశారు. నాటినుండి ఎంత ప్రయత్నించినా.. సీసీఐ ఇక్కడ కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో జిల్లాలో ఒక్క షాద్‌నగర్‌లోనే సీసీఐ కొనుగోలు కేంద్రం కొనసాగుతూ వచ్చింది.

అయితే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో సీసీఐ కొనుగోలుకేంద్రం మంజూరైంది. దీంతో రైతులకు ప్రభుత్వ మద్దతుధరలు దక్కే అవకాశం ఏర్పడింది. జడ్చర్లలో కేవలం పత్తి క్రయవిక్రయాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్ల అంచనావ్యయంతో గంగాపూర్ రహదారి సమీపంలో పత్తి మార్కెట్‌యార్డును ప్రత్యేకంగా నిర్మించారు.

అయితే పత్తి మార్కెట్‌ను అన్ని హంగులతో నిర్మించినా సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో సాధారణ విక్రయాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఇక్కడ సీసీఐ కేంద్రం లేకపోవడంతో రైతులు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకునిపోయే పరిస్థితి ఉండేది. గ్రామాల్లో దళారులు, మార్కెట్‌లో వ్యాపారులు పత్తి రైతులను నిలువునా మోసంచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీసీఐ కేంద్రం ఏర్పాటుకావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు