ఎన్నాళ్లకెన్నాళ్లకు..

22 Oct, 2019 02:26 IST|Sakshi

మూడేళ్ల అనంతరం శ్రీరాంసాగర్‌కు జలకళ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎట్టకేలకు నిండింది. మహారాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరుతుండటంతో మూడేళ్ల అనంతరం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి 83 వేల క్యూసెక్కుల భారీ వరద పోటెత్తడంతో సోమవారం ఉదయం 16 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా మరో ఐదు వేలు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు.. మొత్తం 83 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ప్రాజెక్టులోకి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీ) అడుగులు.

మూడేళ్ల తర్వాత..: మూడేళ్ల అనంతరం ఎస్సారెస్పీ గేట్లను ఎత్తారు. 2016 సెప్టెంబర్‌లో ఇలాగే భారీగా వరద జలాలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి అప్పట్లో లక్షలాది క్యూసెక్కులు నదిలోకి వదిలారు. 2013లోనూ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఇలా ప్రతి మూడేళ్లకు ఒకసారి గేట్లు ఎత్తే పరిస్థితి నెలకొంది. గత ఏడాది 2018 అక్టోబర్‌ 21న ప్రాజెక్టులో కేవలం 41 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. 2017లోనూ ప్రాజెక్టు పూర్తిగా నిండలేదు. 2015లో ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది. కానీ ఈసారి అక్టోబర్‌లో ప్రాజెక్టు నిండటం అరుదని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పోటెత్తారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా