మళ్లీ పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర

3 Oct, 2018 01:56 IST|Sakshi

  రూ.58.50 పెంపుతో రూ.936.50కు చేరిన గ్యాస్‌ ధర

  పెరిగిన ధర తిరిగి సబ్సిడీగా ఖాతాలోకి

సాక్షి, హైదరాబాద్‌: వంట గ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. గత 6 నెలల నుంచి క్రమంగా పెరుగుతున్న సిలిండర్‌ ధర.. తాజాగా రూ.58.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సబ్సిడీ లేని వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.936.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరుగుతుండటంతో వంట గ్యాస్‌ ధరపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో గత 6మాసాల్లోనే రూ.233.50 మేర గ్యాస్‌ ధర పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్‌ ధరలో మాత్రం హైదరాబాద్‌లో మార్పు లేదు.

పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్‌ వినియోగదారులపై నయా పైసా కూడా అదనపు భారం లేకుండా పోయింది. అయితే సబ్సిడీ సిలిండర్‌కు నగదు బదిలీ పథకం వర్తింపు కారణంగా మొత్తం ధర ఒకేసారి చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేయడం నిరుపేదలకు భారంగా తయారైంది. ప్రస్తుతం పెరిగిన నగదు తిరిగి బ్యాంకు ఖాతాలోకి వస్తుండటంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు