రైల్వే శాఖలో చలనం

27 Jul, 2014 23:06 IST|Sakshi

 బషీరాబాద్: ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ చేపట్టిన టీకాస్ ప్రయోగం ఆదివారం మరోసారి చేపట్టారు. రైలు ప్రమాదాలను పసిగట్టి  ప్రమాదాలు జరగకుండా టీకాస్ పద్ధతిని ఈ ఏడాది ప్రవేశపెడతామని 5 నెలల క్రితం రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. టీకాస్ ప్రయోగం విజయవంతమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించారు.

ఎదురెదురుగా రైళ్లు ప్రయాణించినా ప్రమాదం జరగకుండా వాటంతటవే నిలిచిపోయేలా రైల్వే శాఖ, ఆర్డీఎస్‌ఓల సంయుకాధ్వర్యంలో ట్రెయిన్ కొలిజన్ అవైడింగ్ సిస్టం (టీకాస్) ప్రయోగం  సుమారు 20 నెలలుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కర్నెక్స్ కంపెనీకి చెందిన సిబ్బంది నవాంద్గి రైల్వే స్టేషన్‌లో సాంకేతిక పరికరాలు పరిశీలించారు. పది రోజుల పాటు ఆర్డీఎస్‌ఓ (టీకాస్) ప్రాజెక్టు డెరైక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక పరికరాలను కర్నెక్స్ కంపెనీ సిద్ధం చేసుకొంటోంది.

 నాలుగైదు నెలలు క్రితం టీకాస్ ప్రయోగం నిలిపివేసిన అధికారులు ఆదివారం టీకాస్ లోకో ఇంజిన్ రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నవాంద్గి- మంతట్టి రైల్వే స్టేషన్‌ల మధ్య తిరుగుతూ కనిపించింది. ప్రమాదాలు జరిగితే కానీ రైల్వే శాఖ కళ్లు తెరవదంటూ పలువురు విమర్శించారు. గత గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొని పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషాద ఘటన పాఠకులకు విదితమే.

మరిన్ని వార్తలు