సహకార సమరం

16 Dec, 2018 10:49 IST|Sakshi

28న తుది ఓటరు జాబితా ప్రకటన

సాక్షి, మెదక్‌: జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. సహకార సంఘాల సభ్యుల ఫొటో ఓటరు ముసాయిదా జాబితా సిద్ధం అవుతోంది. ఈ నెల 28న తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జనవరి 15న సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా సహకార శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బ్యాలెట్‌ బాక్సుల సేకరణ, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని 20 మండలాల్లో 36 సహకార సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో రుణాలు తీసుకుని సభ్యులుగా చేరిన రైతులు 78 వేల మంది ఉన్నారు. వీరిలో ఓటు హక్కు కలిగిన సభ్యులు 52,600 మంది ఉన్నారు. ఎన్నికల నాటికి రుణం తీసుకున్న రైతులు ఏడాది పూర్తయితేనే వారికి ఓటు హక్కు లభిస్తుంది.

ఈ ఏడాది పూర్తి కాని సభ్యుల సంఖ్య జిల్లాలో 20 వేలు. దీంతో వీరికి ఓటరు జాబితాలో చోటు దక్కడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి 20 వేల మందికి ఓటు హక్కు లభిస్తుంది. సహకార  సంఘాల ముసాయిదా ఓటరు జాబితాలను పంచాయతీల్లో ప్రద్శిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే వాటిని ఈ నెల 23లోగా ప్రాథమిక సహకార సంఘాల్లో తెలపాల్సి ఉంటుంది. సవరించిన తుది ఫొటో ఓటరు జాబితాను ఈ నెల 28న ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సహకార రిజిష్ట్రార్‌ శాఖ ఆదేశాల మేరకు పొరుగు జిల్లాలోని సహకార సంఘాల పరిధిలోకి వచ్చే మెదక్‌ జిల్లాలోని గ్రామాల విలీన ప్రక్రియను ప్రారంభించారు. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండంలోని ఐదు గ్రామాలు, అల్లాదుర్గం మండలంలోని పది గ్రామాలు సంగారెడ్డి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో విలీనం చేయనున్నారు. చేగుంట మండలంలోని నాలుగు గ్రామాలు సిద్దిపేట జిల్లాలో విలీనం కానున్నాయి. సిద్దిపేట జిల్లాలోని నర్సంపల్లి గ్రామం తూప్రాన్‌ సహకార సంఘంలో విలీనం కానుంది.  

36 సంఘాలకు ఎన్నికలు
జిల్లాలో మొత్తం 36 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం ఉన్నాయి. వీటి పదవీ కాలం ఈ ఏడాది జనవరితో ముగిసింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 36 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది.  తాజాగా సహకార ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది. 36 సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం 481 పోలింగ్‌ బూతులను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎన్నికల కోసం 529 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో సహకార సంఘం పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉంటారు. 13 మంది డైరెక్టర్లను బ్యాలెట్‌ పద్ధతిలో సంఘం పరిధిలోని ఓటర్లు ఎన్నుకుంటారు. డైరెక్టర్ల ఎన్నిక ముగిసిన అనంతరం అందులోనే ఒకరిని సంఘం చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.

వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు అంతా కలిసి జిల్లా సహకార సంఘం చైర్మన్, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. సహకార సంఘాల ఓటరు జాబితాలు సిద్ధం అవుతుండటంతోపాటు జనవరిలో నోటిఫికేషన్‌ రానుంది. దీంతో గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల వేడి మొదలైంది. పీఏసీఎస్‌ డైరెక్టర్లుగా, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడంపై ఆశావహులు అప్పుడే దృష్టి సారించారు. సహకార సంఘంలోని ఓటరు జాబితా ఆధారంగా ఓటర్లను కలిసి ఇప్పటి నుంచే వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు సైతం సహకార ఎన్నికలపై దృష్టి సారించాయి. పీఏసీఎస్‌ చైర్మన్‌తోపాటు జిల్లా సహకార సంఘం చైర్మన్‌ పదవి తమ పార్టీకి చెందిన వారికి దక్కేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.

మరిన్ని వార్తలు