ఇందూరుకు పెద్దపీట

12 Jun, 2014 03:28 IST|Sakshi
ఇందూరుకు పెద్దపీట

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను పదవులు వరిస్తున్నాయి. రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చోటు దక్కగా తాజాగా మరో ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. ప్రతిపక్ష నేతలకూ కీలక పదవులు లభించాయి. శాసన మండలిలో విపక్ష నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఉప నేతగా షబ్బీర్ అలీ నియమితులైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారడంతో జిల్లా ఒక పదవిని కోల్పోయింది. కీలక పదవులు పొందినవారు జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తారన్న ఆశతో
 ప్రజలు ఉన్నారు.
 
- జిల్లా నేతలను వరిస్తున్న పదవులు
- వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం
- శాసనమండలి కాంగ్రెస్ పక్షనేతగా డీఎస్
- మండలిలో కాంగ్రెస్ ఉప నాయకుడిగా షబ్బీర్ అలీ
- ప్రభుత్వ విప్‌గా బోధన్ ఎమ్మెల్యే షకీల్
- ఇకనైనా అభివృద్ధిలో జిల్లా పరుగులెత్తేనా?

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘తెలంగాణ’లో జిల్లా ప్రాధాన్యత పెరుగుతోంది. ప దవుల పరంగా ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో కొత్త రాష్ట్రంలో ఇందూరు ఖ్యాతి ఇనుమడిస్తోంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్య వసాయ శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్ సైతం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చింది. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్‌ను నియమించింది.

ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు క్యాబినెట్ హోదా దక్కింది. మండలిలో కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడిగా కామారెడ్డికి చెందిన షబ్బీర్ అలీ నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా టీఆర్‌ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను ప్రభుత్వ విప్‌గా నియమించింది. కాగా శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది.
 
కీలక పదవులు కలిసొచ్చేనా?
జిల్లాకు ఇప్పటి వరకు వచ్చిన అన్ని పదవులు కీలకమైనవే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు కట్టబెట్టిన పదవులతో నేతలు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసే అవకాశం లభించింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి గతంలోనూ మంత్రిగా వ్యవహరించారు. వ్యవసాయాధారిత జిల్లా నుంచి గెలుపొందిన ఆయనకు కేసీఆర్ వ్యవసాయ శాఖను కట్టబెట్టారు. అనుభవజ్ఞుడైన ఆయన జిల్లాను వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
 
సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు క్యాబినెట్ హోదా దక్కింది. ఈ హోదాతో ఆయన ప్రభుత్వం నుంచి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంజూరు చేయించవచ్చు. షబ్బీర్ అలీ సైతం సీనియర్ నాయకుడే. గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వ విప్‌గా నియమితులైన షకీల్ సైతం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

జిల్లాకు కీలక పదవులు దక్కడంతో ఇందూరు అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రజలు ఆక్షిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. నేతలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ అభివృద్ధిపై దృష్టి సారిస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కష్టమేమీ కాదు. ప్రజల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు