నియోజకవర్గానికో వ్యవసాయాధారిత పరిశ్రమ

5 Sep, 2018 02:21 IST|Sakshi
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

     సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు: హరీశ్‌ 

     పరిశ్రమలకు మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వానిదే.. 

     సిద్దిపేటలో డీఎక్స్‌ఎన్‌ యూనిట్‌కు మంత్రి భూమి పూజ

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులతో వివిధ పదార్థాలు తయారు చేసేలా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయాధారిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మలేసియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ కంపెనీ ఏర్పాటు చేసే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు మంగళవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేసేందుకు ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేయాలంటే రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు కావాలని, వాటిని ప్రభుత్వం సమకూర్చుతుందని తెలిపారు.

పరిశ్రమలకు ఉపయోగపడే 250 ఎకరాల స్థలాన్ని సేకరించామని.. ఇందులో నుంచి 47 ఎకరాలను డీఎక్స్‌ఎన్‌ కంపెనీకి అప్పగిస్తున్నట్లు వివరించారు. ఈ కంపెనీ ద్వారా 1,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా ఈ ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.   సీఎం కేసీఆర్‌ రాబోయే 20 ఏళ్ల ప్రగతిని దృష్టిలో ఉం చుకొని ముందుచూపుతో పనులు చేపడుతున్నారని కొనియాడారు. దళితుల భూములను అభివృద్ధి చేసి వాటి ఉత్పత్తులను డీఎక్స్‌ఎన్‌ కంపెనీకి అప్పగించేలా ప్రణాళిక రూపొందించిన దళిత స్టడీస్‌ చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య సహకారంతో కంపెనీ వచ్చిందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట ప్రాంతంలో జపాన్‌కు చెందిన ఎగ్‌ ప్రాసెస్‌ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి వెల్లడించారు.

శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.. 
ఈ భూముల్లో స్పెరిలేనా, పుట్టగొడుగులు, ఉత్పత్తి చేస్తామని డీఎక్స్‌ఎన్‌ కంపెనీ యజమాని లిమ్‌ తెలిపారు. విత్తన నిల్వ కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. రూ.150 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమలో మరో సంవత్సరంలో ఉత్పత్తులు ప్రారంభమవుతాయని వివరించారు. 2020 నాటికి డీఎక్స్‌ఎన్‌ కంపెనీ ద్వారా ఆహార, మందులు, కాస్మోటిక్స్‌ ఉత్పత్తులు వస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎస్‌ఐసీసీ చైర్మన్‌ బాలమల్లు,  ఎండీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు