భూమిలో సారమెంత

26 Jun, 2019 15:54 IST|Sakshi

మట్టి పరీక్షలపై వ్యవసాయశాఖ దృష్టి 

విచక్షణారహితంగా ఎరువుల వాడకం  

సాక్షి,నిజామాబాద్‌: భూసారంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. రైతుల పంట పొలాల్లో పంటల సాగుకు అవసరపడే పోషకాలు భూమిలో ఉన్నాయా..? లోపమున్న పోషకాలు ఏంటీ..? వంటి అంశాలను తేల్చే పనిలో పడింది. రైతులు కనీస అవగాహన లేకుండా విచ్చలవిడిగా ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఆ గ్రామంలో ఉన్న రైతులందరి భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తోంది.

గ్రామ పరిధిలో ఎంత మంది రైతులు ఉంటే అంత మందికి సంబంధించిన భూముల మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ఈ నమూనాలకు నిజామా బాద్, బోధన్‌లో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటివరకు 26 గ్రామాల్లో సుమారు 4,094 మట్టి నమూనాలను సేకరించింది. సుమారు 80 శాతం నమూనాల సేకరణ పూర్తికాగా, మరో వెయ్యి నమూనాలను ఇంకా సేకరించాల్సి ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.  

యూరియా..
జిల్లాలో రైతులు విచక్షణా రహితంగా ఎరువులను వాడుతున్నట్లు భూసార పరీక్షల్లో తేలింది. యూరియా వినియోగం విపరీతంగా ఉండటంతో భూముల్లో నత్రజని అవసరానికి మించి ఉన్నట్లు గుర్తించారు. అలాగే రైతులు కాంప్లెక్స్‌ ఎరువులను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 60,563 మెట్రిక్‌ టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. ఈ ఎరువు వినియోగం జిల్లాలో ఏటా పెరుగుతూ వస్తుండటాన్ని వ్యవసాయశాఖ గుర్తించింది. అలాగే కాంప్లెక్‌ ఎరువుల వినియోగం కూడా అధికంగా ఉంది. సుమారు 26,500 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను వాడుతున్నట్లు ఆ శాఖ అనధికారిక అంచనా. దీంతో ఎరువులకు సంబంధించిన పోషకాలు అవసరానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఇలా అవసరానికి మించి ఎరువులు వాడటంతో పంట సాగు వ్యయం పెరుగుతోంది. ఈ ఎరువుల మీదే రైతులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ఈ సాగు వ్యయాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

విత్తనోత్పత్తికి అండగా.. 
రైతులు విత్తనోత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసార పరీక్షల ద్వారా వచ్చి న ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించనున్నారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు.

80 శాతం సేకరణ పూర్తయింది
మట్టి నమూనాల పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాము. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశాము. ఇప్పటి వరకు 80 శాతం రైతుల భూములకు సంబందించి మట్టి నమూనాల సేకరణ పూర్తయింది. ఈ నమూనాలను భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టే గ్రామీణ విత్తనోత్పత్తి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  మేకల గోవిందు, జిల్లా వ్యవసాయశాఖాధికారి 

మరిన్ని వార్తలు