రుణమాఫీకి రూ.28 వేల కోట్లు

25 Sep, 2019 02:07 IST|Sakshi

అంచనా వేసిన వ్యవసాయ శాఖ

విధివిధానాల ముసాయిదా ఖరారు.. సర్కారుకు నివేదిక.. 

అమలుకు అనుమతి కోరుతూ లేఖ... సమగ్ర మార్గదర్శకాలు ప్రకటించాక స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ విధివిధానాల ముసాయిదాను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. నివేదికను సర్కారుకు పంపింది. దాని ఆధారంగా సర్కారు అనుమతిస్తే కేటగిరీ వారీగా రైతుల వివ రాలు సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. ఎంతమంది రైతులకు ఎంతెంత బ్యాంకు రుణం ఉందో సమగ్రమైన వివరాలతో ఇస్తామని పేర్కొంది. తాజాగా తయారు చేసిన విధివిధానాల ముసాయిదాను 2014–15లో అమలుచేసిన రుణమాఫీ నిబంధనలకు అనుగుణంగా రూపకల్పన చేశారు. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ వర్తించేలా విధివిధానాల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారం 35 లక్షల మంది రైతులకు రూ.28 వేల కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

అయితే ఈసారి ప్రభుత్వం రైతులకే నేరుగా డబ్బు ఇస్తానని హామీ ఇచ్చినందున సర్కారు మార్గదర్శకాలు కీలకం కానున్నాయి. గతంలో రుణమాఫీని అమలు చేసినప్పుడు రైతుల వివరాలను 5 అనెగ్జరీల్లో పొందుపరిచారు. సర్కా రు అనుమతిస్తే ఈ సారి కూడా అలాగే తయారు చేస్తామని, అందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని ఓ అధికారి పేర్కొన్నారు. గతంలో రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ చేశారు. ఈసారి నేరుగా రైతులకే డబ్బు ఇస్తామని సీఎం వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. ఆ ప్రకారమే వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. గతేడాది ఖరీఫ్‌ రైతు బంధు సొమ్మును చెక్కుల రూపంలో ఇచ్చినట్లే, ఈసారి రుణమాఫీ సొమ్ము కూడా అలాగే ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 

నాలుగు విడతల్లో.. 
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ రూ.లక్ష రుణమాఫీ అమలుచేసింది. మొదటి విడత 2014–15లో రూ.4,040 కోట్లు మాఫీ చేసింది. రెండో విడత 2015–16లోనూ రూ.4,040 కోట్లు, 2016–17లో మూడో విడత రూ.4,025 కోట్లు, నాలుగో విడత 2017–18లో రూ.4,033 కోట్లు మాఫీ చేసింది. ఈ సారి ఎన్ని విడతలుగా మాఫీ చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక గానీ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. గత డిసెంబర్‌ 11ను కటాఫ్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత రుణమాఫీకి ఇప్పటికీ రైతుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ సొమ్ము మాత్రం పెరుగుతుందంటున్నాయి. 

నోరువిప్పని అధికారులు.. 
ఖరీఫ్‌లో రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అలక్ష్యం వహిస్తున్నాయి. ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.14,588 కోట్లే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంత తక్కువ రుణాలు ఇవ్వడంపై సర్కారు బ్యాంకుల పట్ల గుర్రుగా ఉంది. పాత బకాయిలు చెల్లించకుం డా రుణమాఫీకి రైతులు ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు మాత్రం పాత అప్పులు చెల్లించకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వట్లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్‌ 11కు ముం దున్న బకాయిలు తీర్చి తిరిగి బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల రైతులను కోరారు. రుణమాఫీ అమలు చేసినప్పు డు చెల్లించిన పాత బకాయిల సొమ్ము రైతులకు నేరుగా ఇస్తామన్నారు. దీనిపై వ్యవసాయ అధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కొందరు మాత్రం సీఎం చెప్పినట్లు అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యారని బ్యాంకర్లు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా