చూశారు.. విన్నారు

12 Jul, 2018 12:49 IST|Sakshi
మాట్లాడుతున్న పరిశీలకులు  శ్రీనివాసన్‌ కృష్ణన్

సమీక్ష సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి ఆదిలాబాద్, పెద్దపెల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అభ్యర్థులను గుర్తించేందుకు తాము రాలేదని కార్యకర్తలకు తెలిపారు. పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలో గ్రూపులు ఉండొద్దని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలను అమలుచేయడం లేదని, దానిపై తాలుకా, మండల, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్‌ శ్రేణులు ముందుండాలని సూచించారు.

అదే సమయంలో ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. మళ్లీ నియోజకవర్గాలకే వచ్చి అభ్యర్థులను గుర్తిస్తామన్నారు. సీనియర్‌ నాయకులు విభేదాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడాలని, పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. అదే సమయంలో టికెట్ల పంపిణీలో కార్యకర్తల అభిష్టానికే ప్రాధాన్యత ఉంటుందని, నేతల సిఫార్సులను పట్టించుకునేది లేదని పేర్కొన్నారు. 

సాక్షి,ఆదిలాబాద్‌: టికెట్‌ ఆశావహులు బలప్రదర్శనతో వచ్చారు.. నియోజకవర్గంలో తమకున్న పట్టును పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాలని చూశారు.. నేత వెంట వచ్చిన కార్యకర్తల్లోనూ మంచి జోష్‌.. నాయకుడికి జిందాబాద్‌ కొట్టాలన్న ఉత్సాహం.. ఇంకేముంది సమావేశంలో నినాదాలే మార్మోగుతాయని అంతా భావించారు. అయితే పరిశీలకులు మాత్రం మెలిక పెట్టారు. నియోజకవర్గ సమీక్షలో అభ్యర్థి ప్రస్తావన చేయద్దన్నారు. అలా చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే చర్చించాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నియోజకవర్గ సమీక్ష సమావేశం తీరుతెన్నే మారిపోయింది. కార్యకర్తలు నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. మరోవైపు టికెట్‌ ఆశవాహులు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను పరిశీలకుని దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద కాంగ్రెస్‌ సమీక్ష సమావేశంలో ఇది కొత్తకోణం. వర్గపోరు, గ్రూపు విభేదాలను ముందే ఊహించిన పరిశీలకులు అభ్యర్థి ప్రస్తావన లేకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి అంటూ అటు నియోకవర్గ పరిస్థితిని చూశారు.. కార్యకర్తలు, నేతల సమస్యలు,  అభిప్రాయాలను విన్నారు.
  
పరిశీలకులకు ఘన స్వాగతం.. 
ఏఐసీసీ కార్యదర్శి, ఆదిలాబాద్, పెద్దపెల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్‌గౌడ్, ప్రేమ్‌ లత అగర్వాల్, నమిల్ల శ్రీనివాస్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చారు. ఆదిలాబాద్‌ శివారులో కాంగ్రెస్‌ నేతలు పరిశీలకులకు ఘన స్వాగతం పలికారు. బైక్‌ ర్యాలీ నిర్వహించి సమీక్ష సమావేశం నిర్వహించే పంచవటి హోటల్‌కు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు.
 
గందరగోళం.. 
జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశమని పేర్కొనడంతో సుమారు 150 మంది వరకు రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేశారు. అయితే ముఖ్యనేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలిరావడంతో సమావేశం గది పూర్తిగా నిండిపోయింది. మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మొత్తం వారితోనే గది నిండిపోగా, పరిశీలకులతో పాటు మిగతా నియోజకవర్గ నాయకులు అక్కడికి చేరుకునే సరికి గందరగోళ పరిస్థితులు కనిపించాయి. పలువురికి కుర్చీలు కూడా లేకపోవడంతో నిల్చొని ఉన్నారు. మరోపక్క తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. టికెట్‌ ఆశావహులు బలప్రదర్శన చేయాలనే ప్రయత్నాలు కనిపించాయి. ఈ క్రమంలో పరిశీలకులు శ్రీనివాసన్‌ కృష్ణన్‌ జోక్యం చేసుకొని నియోజకవర్గం వారీగా విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. దీంతో నియోజకవర్గ కార్యకర్తలు మినహా ఇతర నియోజకవర్గ కార్యకర్తలు బయటకు వెళ్లిపోవడంతో సమీక్ష ప్రారంభించారు.  
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు.. 
కాంగ్రెస్‌ పార్టీ నియోకవర్గాల సమీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగింది. వేదికపై పరిశీలకులు శ్రీనివాసన్‌ కృష్ణన్, మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రేమ్‌లత అగర్వాల్, నమిల్ల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యులు నరేష్‌జాదవ్‌ కూర్చున్నారు. మొదట సిర్పూర్‌కాగజ్‌నగర్‌ నుంచి సమీక్ష ప్రారంభించారు. ఆతర్వాత చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ముథోల్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు.  
∙    సిర్పూర్‌కాగజ్‌నగర్‌ నుంచి గోసుల శ్రీనివాస్‌యాదవ్, రావి శ్రీనివాస్, సిడాం గణపతి పాల్గొన్నారు. కొంతమంది కార్యకర్తలు నియోజకవర్గానికి ఇన్‌చార్జీలను ప్రకటించాలని పరిశీలకులను కోరారు.  
∙ చెన్నూర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బోడ జనార్దన్, దుర్గం అశోక్, బెల్లంపల్లి నుంచి చిలుమూరి శంకర్, దుర్గాభవానితో పాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాల సమీక్ష సుమారు అరగంట నుంచి 45 నిమిషాల పాటు సాగింది.  
∙ మంచిర్యాల నియోజకవర్గం సమీక్ష సమావేశం గంటకు పైగా కొనసాగింది. ఇందులో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యనేతలు  తాము నియోజకవర్గంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ప్రస్తావించారు. 
∙ ఆసిఫాబాద్‌ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ముథోల్‌ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ పాల్గొనగా, మరో ముఖ్యనేత రామారావుపటేల్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు.  
∙ ఖానాపూర్‌ నుంచి హరినాయక్, భరత్‌చౌహాన్, నిర్మల్‌ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి సి.రాంచంద్రారెడ్డి, గండ్రత్‌ సుజాత, భార్గవ్‌దేశ్‌పాండేలు పాల్గొన్నారు.  
∙ రాత్రి వరకు ఈ సమీక్ష కొనసాగింది. మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు.
  
సోయం బాపూరావు గైర్హాజరు.. ఆదివాసీకే టికెట్‌ ఇవ్వాలి 
బోథ్‌ నియోజకవర్గం నుంచి నరేష్‌జాదవ్, అనిల్‌జాదవ్‌ పాల్గొనగా సోయంబాపూరావు గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపూరావు బోథ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేనిపక్షంలో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తారా అనే మీమాంస పార్టీలో ఉండగా, సమీక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సమీక్ష సమావేశానికి గైర్హాజరు వెనుక ఏదైనా అసంతృప్తి ఉందా అన్న చర్చ సాగుతోంది. స్థానికంగానే ఉన్నప్పటికీ ఆయన ఈ సమావేశానికి రాలేదు. అయితే వేదికపై లంబాడా నాయకులు ఉండడంతోనే ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు కొంతమంది కార్యకర్తలతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా బోథ్‌ సమీక్ష సమావేశంలో కొంతమంది కార్యకర్తలు బోథ్‌ నియోజకవర్గం నుంచి ఆదివాసీకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం నుంచి కూడా ఆదివాసీకే అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు