నల్లగొండకు శ్రీరాంసాగర్‌ నీళ్లు : రాహుల్‌గాంధీ  

6 Dec, 2018 13:12 IST|Sakshi
అభివాదం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, చిత్రంలో ఉత్తమ్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వెంటనే తీసుకొస్తాం

రైతులు, యువతను కేసీఆర్‌ దత్తత తీసుకోవాలి

 100 పడకల ఆస్పత్రిని పూర్తి చేస్తాం 

 మేడ్‌ ఇన్‌ తెలంగాణ.. మేడ్‌ ఇన్‌ నల్లగొండ మా లక్ష్యం 

 కోదాడ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ  

సాక్షిప్రతినిధి, సూర్యాపేట/కోదాడ : ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ కుటుంబానికి సంపూర్ణ సంపద చేకూరింది. కానీ తెలంగాణ ప్రజలకు నైరాశ్యమే మిగిలింది. మీ సంపన్న కుటుంబం మినరల్‌ వాటర్‌ తాగుతున్నారు. కానీ నల్లగొండ ప్రజలకు మాత్రం ఫ్లోరైడ్‌ నీళ్లు సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాగానే శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టును ఆధునికీకరించి ఉమ్మడి నల్లగొండ ప్రజలకు నీళ్లిస్తాం. గతంలో నల్లగొండ వచ్చిన కేసీఆర్‌ నల్లగొండను దత్తత తీసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదే ఆస్పత్రిని తిరిగి ప్రారంభిస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు. ఆస్పత్రి హామీలను మీరు నెరవేర్చలేదు కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం నల్లగొండలో 100 పడకల ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తుంది’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓవైపు కేసీఆర్‌ను నిప్పులు చెరుగుతూనే మరోవైపు ఉమ్మడి నల్లగొండ గురించి ప్రస్తావించారు.

బుధవారం కోదాడలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, హుజుర్‌నగర్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ అభ్యర్థి పద్మావతిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాకు వచ్చి జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారని, ఆయన దాదాపు ప్రతి జిల్లాకు పోయి దత్తత తీసుకుంటామంటున్నారని, కానీ కేసీఆర్‌ దత్తత తీసుకోవాల్సింది జిల్లాలను కాదని,  తెలంగాణలోని రైతులు, యువత, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణంæ చేసుకున్న వారి కుటుంబాలను అని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశారని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్‌ హామీని నెరవేర్చలేదని, వీరందరినీ.. కేసీఆర్‌ దత్తత ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బడ్జెట్‌లో 20శాతం నిధులు యువకుల విద్యోన్నతి కోసం, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల కోసం వెచ్చిస్తామన్నారు. అన్ని మండలాల్లో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని తెలిపారు. దేశానికి నష్టం కలిగిస్తున్న మోదీ, కేసీఆర్‌ బంధనాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నామని, కాంగ్రెస్‌ పార్టీ, మిగిలిన పార్టీలతో కలిసి రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీని కూడా ఇంటికి పంపిస్తామన్నారు. సెల్‌ఫోన్, మైక్, దుస్తులు.. ఇలా అన్నింటిపైనా మేడ్‌ ఇన్‌ చైనా అని ఉంటుందన్నారు. మా లక్ష్యం ప్రతి వస్తువుపైనా మేడ్‌ ఇన్‌ తెలంగాణ.. మేడ్‌ ఇన్‌ నల్లగొండ అని ఉండాలన్నారు.  
కోదాడ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి : చంద్రబాబునాయుడు

మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు 

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించాలని, 7న పోలింగ్, 11న కౌంటింగ్‌.. ఇప్పుడున్న సీఎం ఈనెల 11 తర్వాత మాజీ సీఎంగా ఉంటాడని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని చిత్తుగా ఓడించేలా తీర్పు ఇవ్వాలని, కోదాడ చరిత్రలో ఇది చిరస్థాయిగా మిగిలిపోవాలన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో కోదాడలో పద్మావతిరెడ్డి గెలవబోతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ కలిశామని దేశంలో, రాష్ట్రంలో కలిశామంటే ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నారు. అందుకే రెండు పార్టీలు కలిసి ప్రజాకూటమిని సమర్థిస్తున్నామన్నారు. 
కేసీఆర్‌ పాలనకు ఘోరీ కట్టాలి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ పాలనకు ఘోరీ కట్టాలని, అది కోదాడ నుంచే ప్రారంభం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాలలో తాను, తనభార్య ఉన్నామని, నియోజకవర్గ ప్రజలనే తమ పిల్లలుగా భావించి నిస్వార్థంగా సేవలందిచామని, ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అదే రోజు రైతుల రుణాలు 2 లక్షల రూపాయలను ఏక మొత్తంగా రద్దు చేస్తామని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని, దానిలో భాగంగా 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. భార్య, భర్తలు ఇద్దరికి 2 వేల రూపాయల ఫించన్‌తోపాటు ఫించన్‌ వయస్సును 58 సంవత్సరాలకు తగ్గిస్తామని హమీ ఇచ్చారు.    
బీజేపీతో కేసీఆర్‌ కుమ్మక్కు :సురవరం సుధాకర్‌రెడ్డి


మాట్లాడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి 

రాష్ట్రంలో నిరంకుశ, అహంకారపూరిత పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించడానికి మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ  జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. దేశంలో మత రాజకీయాలను చేస్తున్న బీజేపీకి అన్ని విధాల టీఆర్‌ఎస్‌ మద్దతు నిస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం  మతో న్మాదాన్ని రెచ్చగొడుతుందని, దానికి టీఆర్‌ఎస్‌కు లంకె ఉందని, అక్బరుద్దీన్‌ ఎన్నికల సభలో మా ట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి అయినా తనముందు తలవంచాల్సిందేనని బహిరంగ వ్యాఖ్యలు చేస్తే కనీసం వాటిని ఖండించే ధైర్యం కూడా కేసీఆర్‌కు లేదని అన్నారు.  ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి. కుంతియా, ఎంపీ కేశినేని నాని, ఏఐసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు