సీఎం కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

22 Apr, 2020 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రబీలో సాగైన పంటలు, ప్రభుత్వ కొనుగోళ్ల పరిస్థితిపై సీఎంకు లేఖలో వివరించారు. రైతులను ఆదుకునే విషయంలో తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి  అన్ని రకాల మద్దతు ఇస్తామని తెలియజేశారు.

గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి..
1. మే 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన  మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కరోనాను మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి  మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ లాక్‌డౌన్‌ పొడిగింపు వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిద్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా అన్నదాత అయిన రైతన్న మరీ ప్రమాదంలో పడ్డాడు. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది. 

2. ఈ రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 53.68 లక్షల ఎకరాల్లో వివిధ రకాల  పంటలు సాగయ్యాయి. రబీ సాధారణ విస్తీర్ణం 31. 58 లక్షల ఎకరాలు కాగా... ఈ సీజన్ లో 70 శాతం అదనంగా (మొత్తం 170 శాతం) విస్తీర్ణంలో పంటలు  సాగైనట్లు  వ్యవసాయశాఖ వ్రభుత్యానికి నివేదిక ఇచ్చింది. ప్రధానంగా  వరి 39.24  లక్షల ఎకరాలు మొక్కజొన్న  6.21 లక్షల ఎకరాలు, శనగ(బెంగాల్ గ్రామ్ ) 3.28 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.30 లక్షలఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి . 

3. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 16.89 లక్షల ఎకరాలు కాగా... ఈ రబీలో 39.24 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి 132 శాతం ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగైంది . సగటున ఎకరానికి 28 క్వింటాళ్ల చొప్పున 11 కోట్ల క్వింటాళ్లు (1.10 కోట్ల టన్నుల) వరి ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. రైతు పండించిన ప్రతి గింజ కొంటామని, రాష్ట్రంలో 7,500 కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో ఆదివారం నాటికి 4,380 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు 6.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది.  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల, ఏఎమ్మార్పీ కింద 1 లక్ష ఎకరాలు కలిపి 3.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే .. 3 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయిన వరి ధాన్యం మొత్తాన్ని మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లర్లే కొనుగోలు చేశారు. మరో 80 వేల ఎకరాల్లో  ఇంకా వరి కోతలు పూర్తికాలేదు.  అంటే ప్రభుత్వం కొనేది తక్కువ, మిల్లర్లు కొనేది ఎక్కువ ఉంది.  అదే క్రమంలో ప్రభుత్వ కొనుగోలు  కేంద్రాల్లో సన్న ధ్యానం కొనుగోలు చేయటం లేదు. కేవలం దొడ్డు రకాలనే కొంటున్నారు . 

4.  రబీ సీజన్ ధాన్యం నింపడానికి 20 కోట్ల గోనె సంచులు (గన్నీ బ్యాగులు) అవసరమని, పశ్చిమ బెంగాల్ నుంచి వాటిని తెప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాత గన్నీ బ్యాగులను కొనడానికి గతంలో రూ.16 ఉంటే, ఇప్పుడు రూ .18 కి  పెంచారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం గన్నీ బ్యాగుల కొరత విపరీతంగా ఉంది. ప్యాడీ క్లీనర్లు, విన్నోవింగ్ ఫ్యాన్లు, తేమ యంత్రాలు కొరత ఉంది.

5.  మొక్కజొన్నకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ . 1,760 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 890 మక్కల కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేశారు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు రైతుల నుంచి టీఎస్-మార్క్ ఫెడ్  కొనుగోలు చేసింది. వాస్తవానికి ఫిబ్రవరి నుంచే మొక్కజొన్న హార్వెస్టింగ్  ప్రారంభం అయ్యింది. అప్పటికి  ప్రభుత్వం సెంటర్లు ఏర్పాటు చేయకపోవటంతో రైతులు ప్రైవేటు ట్రేడర్లకు అమ్ముకున్నారు. ట్రేడర్లు ధర తగ్గించి  రూ .1,300 నుంచి రూ .1,400  క్వింటాలు చొప్పున మక్కలు  కొనుగోలు చేయటంతో  రైతులు నష్టపోయారు.  

రెండు నెలలపాటు ఇలాగే జరిగింది. చివరకు లాక్‌డౌన్‌ సమయంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అప్పటి  నుంచి మార్కెట్లు బంద్ కావటంతో మార్క్ ఫెడ్  సెంటర్లలోనే  మక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి.  రబీలో 6.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా.. ఎకరానికి  30 క్వింటాళ్ల  చొప్పున 18.60 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు రాష్ట్రంలో  ఉత్పత్తి అవుతాయి. కాని ఇప్పటివరకు 1.30 లక్షల టన్నులే  ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు పై ప్రత్యేక శ్రద్ద సారించాలి.

6.  రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 20 వేల, 300 ఎకరాలలో పసుపు  పంటను సాగు చేశారు. లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్లు బంద్ కావడంతో పసుపు అమ్ముకునే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌కు ముందు క్విటాల్‌కు 4500 రూపాయల నుంచి 4900 రూపాయల వరకు ప్రైవేట్ ట్రేడర్లు కొనుగులు చేసి రైతును నిలువునా దోచుకున్నారు. ఒక పక్క పసుపు పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మరో పక్క కేంద్రం మద్దతు ధర ప్రకటించలేదు. రాష్ట్ర  ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కూడా ప్రకటించలేదు. క్వింటాలుకు రూ .15 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించి, మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ ఉంది. 

7.  శనగ పంట కొనుగోలుకు రాష్ట్రంలో 84 కేంద్రాలు  ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రకటించిన ధర రూ. 4,875 ఉంది. కేంద్రం ప్రభుత్వం కేవలం 47,600  మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు 50 వేల మెట్రిక్ టన్నుల శనగలు  రాష్ట్రంలో కొనుగోలు చేశారు. ఇంకో 27 వేల టన్నుల పర్మిషన్ అడిగారు. ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాలేదు. రాష్టంలో రబీ సీజన్ లో 3.28 లక్షల ఎకరాల్లో రైతులు శనగ పంట సాగుచేశారు. మొత్తం శనగ పంటలను గిట్టుబాటు ధరలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. 

8.  కందుల కొనుగోళ్లు  రాష్ట్రంలో నిలిపి వేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్విటాలుకు రూ.5,600 కనీస మద్దతు ధరతో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేశారు. కందులను కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలి. 

9. బత్తాయి, మామిడి లాంటి పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు లేదా మార్కెట్లో మంచి ధరలు ఉన్న ప్రాంతాల్లో రైతులు వారి ఉత్పత్తలను అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా కూరగాయలు పండిస్తున్న రైతులను ఆదుకునేందుకు గ్రామాలలోనే కూరగాయలను ప్రభుత్వమే కొని నగరాలలో ఉన్న ప్రజలకు "మన ఊరు మన కూరగాయలు" పథకం మాదిరి అందజేయాలి.

మరిన్ని వార్తలు