ఇంజనీరింగ్‌లో ముందు ఆన్‌లైనే

19 Jul, 2020 00:56 IST|Sakshi

ఇంజనీరింగ్‌లో బోధనపై అధికారుల కసరత్తు

సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలు

వచ్చే నెల 17 నుంచి ఆరంభం 

2,3 నెలల వరకు ఆన్‌లైన్, వీడియో పాఠాలే కొనసాగింపు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ బోధనకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి వచ్చే నెల 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా జేఎన్‌ టీయూ, ఓయూ రిజిస్ట్రార్‌లతోనూ ఉన్నతాధికారులు శుక్రవారం చర్చించారు. వచ్చేనెల నుంచి తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇప్పటికే జేఎన్‌టీయూ కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన విద్యా బోధన ప్రణాళికపై ఓ నివేదికను సిద్ధం చేసింది. దానిని కూడా అధికారులు పరిశీలించారు. దాని అమలుకు అవసర మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందుగా కాలేజీలు విద్యార్థులకు వెబి నార్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. వాటిని ఇప్పుటి నుంచే ప్రారంభిస్తే విద్యార్థులు అలవాటు పడతారని, ఏమైనా లోటుపాట్లు ఉన్నా తెలుస్తాయని, వీటిని సవరించుకొని ఆగస్టు 17వ తేదీనుంచి రెగ్యులర్‌ తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వíహించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఆన్‌లైన్‌ తరగతులను ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనే అమలు చేయడం సాధ్యం అవుతుందన్న భావనకు వచ్చారు.

ఇక సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో రికార్డెడ్‌ వీడియో పాఠాలను బోధించాలన్న నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా టీశాట్, దూరదర్శన్‌ వంటి చానళ్ల ద్వారా, మరోవైపు యూట్యూబ్‌ చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నందున ఆన్‌లైన్‌ బోధన సాధ్యం కాదన్న భావనకు వచ్చారు. అందుకే వీడియో పాఠాలను రూపొందించి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వీలైన వారు వింటారని, మరోవైపు స్వయం పోర్టల్‌లో ఉన్న పాఠాలను కూడా వింటారన్న భావనకు వచ్చారు. అలాగే టీశాట్, దూరదర్శన్‌ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు.

ఇలా సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్‌లైన్‌ బోధనను, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలను రెండు మూడు నెలలపాటు నిర్వహించనున్నారు. అప్పటికీ కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోతే కొన్నాళ్లు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో బోధనను కొనసాగించనున్నారు. భౌతికదూరం పాటించేలా విద్యార్థులను విభజించి షిప్ట్‌ పద్దతుల్లో తరగతులు కొనసాగించడం లేదా రోజు విడిచి రోజు (ఒక రోజు ఆన్‌లైన్, ఒక రోజు ఆఫ్‌లైన్‌) పద్ధతుల్లో బోధనను కొనసాగించనున్నారు. కరోనా అదుపులోకి వచ్చాకే విద్యార్థులు అందరికీ రెగ్యులర్‌ తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు