తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

26 Jul, 2018 20:48 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) సేవలు తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. దీంతో నిమ్స్‌ కోసం ఏర్పాటు చేసిన భవణాల్లోనే ఎయిమ్స్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే భవణాలు సిద్దంగా ఉన్నందున వైద్య సేవలు అతిత్వరలోనే ప్రారంభం చేస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. బీబీనగర్‌లో మరో 49 ఎకరాల స్థలంతో పాటు, రోడ్లు, విద్యుత్‌ వంటి పలు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

పోరాడి సాధించాం.. భువనగిరి జిల్లాలో ఎయిమ్స్‌ ఏర్పాటును పోరాడి సాధించామని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ పేర్కొన్నారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు స్థల రూపంలో తొలి అడుగుపడడం సంతోషంగా ఉందని.. ఏడాది లోపు ప్రిలిమినరీ సేవలు ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ తెలిపారు. 

కేంద్రానికి ధన్యవాదాలు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషితోనే ఎయిమ్స్‌ ఏర్పాటు జరగనుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతిష్టాత్మక వైద్య సేవలు రావడానికి సీఎం కేసీఆర్‌ విశేష కృషి చేశారని పేర్కొన్నారు.  ఎయిమ్స్‌ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.    

మరిన్ని వార్తలు