అనుకోకుండా ఒకరోజు...

11 Oct, 2019 04:52 IST|Sakshi

పండగ వేళ ఊపిరి పీల్చుకున్న నగరవాసులు

దసరా రోజున స్వచ్ఛమైన గాలి..సాధారణ స్థాయికి సౌండ్‌ లెవల్స్‌

సిటీలో పలు రద్దీ ప్రాంతాల్లో 40–50% మేర తగ్గిన శబ్ద, వాయు కాలుష్యం

మెజార్టీ సిటీజనులు పల్లెబాట పట్టడమే కారణం

పీసీబీ తాజా నివేదికలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బయటకొచ్చి రోడ్డుపై ప్రయాణించాలంటే హైదరాబాదీయులకు నిత్యం నరకమే. ఓవైపు సుమారు 50 లక్షలకుపైగా వాహనాల రాకపోకల రణగొణధ్వనులతో స్థాయికి మించి శబ్ద కాలుష్యం, మరోవైపు ఆ వాహనాల నుంచి వెలువడే దట్టమైన పొగ ఊపిరి సలపని పరిస్థితి, అధిక ధూళి కణాలతో కళ్లు మండేంత వాయు కాలుష్యం. కానీ, దసరా పండుగ రోజు మాత్రం నగరవాసులకు ఈ ఇక్కట్లు తప్పాయి. స్వచ్ఛమైన గాలితో ఊపిరి తీసుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే దసరా పండుగ రోజు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం 40 నుంచి 50% మేర తగ్గడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది.

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెలువరించిన తాజా కాలుష్య నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పీసీబీ ప్రమాణాల మేరకు ఘనపుమీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలో పలు రద్దీ కూడళ్లలో సాధారణ రోజుల్లో 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుంది. దసరా రోజున నగరంలో 60 నుంచి 70 మైక్రోగ్రాముల లోపలే ధూళికాలుష్యం నమోదవడం విశేషం. ఇక శబ్దకాలుష్యం పీసీబీ ప్రమాణాల మేరకు 55 డెసిబుల్స్‌ దాటకూడదు. కానీ సిటీలో పలు ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో వాహనాల హారన్ల మోతతో 90 నుంచి 100 డెసిబుల్స్‌ మేర శబ్దకాలుష్యం నమోదవుతుండటంతో నగరవాసుల గూబగుయ్‌ మంటుంది. కానీ దసరా రోజు పలు ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 50 నుంచి 60 డెసిబుల్స్‌ మాత్రమే నమోదవడంతో నగరవాసులు కాలుష్య విముక్తి పొంది పండగ చేసుకోవడం విశేషం.

శబ్ద, వాయుకాలుష్యం తగ్గడానికి   కారణాలివే 
గ్రేటర్‌ జనాభా కోటి మార్కును దాటింది. సిటీలో సుమారు పదివేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై నిత్యం రాకపోకలు సాగించే అరకోటి వాహనాల్లో పండుగ రోజు సగం వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. దీంతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మెజార్టీ నగరవాసులు పల్లెబాట పట్టడం, సిటీలో ఉన్న వారు సైతం ఇంటికే పరిమితమై ఇంటిల్లిపాదీ కలసి పండగ చేసుకోవడం కూడా కాలుష్యం తగ్గేందుకు కారణమైనట్లు చెబుతుండటం విశేషం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా