ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం

21 Jun, 2020 02:54 IST|Sakshi

చైనాతో సరిహద్దులో పరిస్థితిపై ఐఏఎఫ్‌ చీఫ్‌

అత్యవసరానికి తగినట్లుగా బలగాలను మోహరించాం

ఆ దేశం స్థావరాలు, కార్యకలాపాలు అన్నీ తెలుసు

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా వెల్లడి

దుండిగల్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: చైనాతో సరిహద్దు వెంబడి ఎదురయ్యే ఎలాంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా, తగిన విధంగా మోహరించి ఉన్నామని ఐఏఎఫ్‌ చీఫ్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా స్పష్టం చేశారు. చైనా వాయుసేన సామర్థ్యం, దాని వైమానిక కేంద్రాలు, కార్యకలాపాల స్థావరాలు, సరి హద్దులో బలగాల మోహరింపు గురించి తమకు తెలుసని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో అధికారుల కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ను సమీక్షించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పూర్తి పరిస్థితితో పాటు ఎల్‌ఏసీ ఆవల మోహరింపుల గురించి కూడా మాకు తెలుసు. లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ లో వీర జవాన్లు చేసిన అత్యున్నత త్యాగాన్ని వృథా కానివ్వబోమన్న కృతనిశ్చయం తో ఉన్నాం’అని భదౌరియా తెలిపారు.

శనివారం దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ అనంతరం యువ అధికారుల సంబరం

అయితే అదే సమయంలో తాజా పరిస్థితిని శాంతియుతం గా పరిష్కరించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. సరిహద్దులో చైనా ఏటా బలగాలను మోహరించి వైమానిక విన్యాసాలు చేపడుతున్నప్పటికీ ఈసారి మాత్రం ఆ కార్యకలాపాలు పెరిగాయన్నారు. ‘ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా మన సాయుధ దళాలు అన్ని సమయాల్లో సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎల్‌ఏసీ వద్ద చోటుచేసుకున్న పరిణామం మేం అతితక్కువ సమయంలో ఏం చేయాల్సిన అవసరం ఉందో చెప్పే చిన్న ఉదాహరణ’అని భదౌరి యా వ్యాఖ్యానించారు. అంతకుముందు జరిగిన పరేడ్‌లో 123 మంది ఫ్లయిట్‌ కేడెట్‌లకు ‘ప్రెసిడెం ట్స్‌ కమిషన్‌’ను, ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్‌కు చెందిన 11 మంది అధికారులకు ‘వింగ్స్‌’ ను ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భదౌరియా అందజేశారు. 123 మంది అధికారుల్లో 61 మంది ఫ్లయింగ్‌ బ్రాంచీలో, 62 మంది గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచీలో చేరారు. వారిలో 19 మహిళా అధికారులున్నారు. వియత్నాం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు ఫ్లయింగ్‌ కేడెట్‌లు కూడా శిక్షణను పూర్తిచేసుకున్నారు. 

ప్రతిభావంతులకు అవార్డులు
పైలట్‌ కోర్సులో అత్యుత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ నయన్‌కు ‘స్వార్డ్‌ ఆఫ్‌ హానర్‌’తోపాటు రాష్ట్రపతి ఫలకాన్ని (ప్రెసిడెంట్స్‌ ప్లేక్‌) అందజేశారు. గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచీలో ప్రథ మ స్థానంలో నిలిచిన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ఆంచల్‌ గంగ్వాల్‌కు రాష్ట్రపతి ఫలకాన్ని (ప్రెసిడెంట్స్‌ ప్లేక్‌) అందించారు.  

కలలు నెరవేర్చుకోండి..
కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ సందర్భంగా ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ భదౌరియాకు ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, ట్రైనింగ్‌ కమాండ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఏఎస్‌ బుటోలా, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ జె. చలపతి సాదర స్వాగతం పలికారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌కు అనుగుణంగా జనరల్‌ సెల్యూట్‌ చేశారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ తాము ఎన్నుకున్న రంగంలో మేటిగా నిరూపించుకునేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వాయుసేన సేవల్లో చేరుతున్న సందర్భంగా చేసిన ప్రతిజ్ఞ మేరకు తమ బాధ్యతలు, విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సైనికదళాల్లో చేరాలనే తమ పిల్లల నిర్ణయానికి మద్దతు తెలిపి సహకరించిన తల్లితండ్రులు, వారి బంధువులకు భదౌరియా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత వాయుసేనలో చేరడం ద్వారా తమ కలలు, అభిరుచులను సాధించుకోవాలని యువతీ యువకులకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు