పొద్దంతా పొగ... ఒళ్లంతా సెగ 

9 Jun, 2018 08:41 IST|Sakshi

గ్రేటర్‌లో పెరుగుతోన్నభూ స్థాయి ఓజోన్‌ మోతాదు 

ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు డేంజర్‌ 

ట్రాఫిక్‌ రద్దీ సమయంలోనే ప్రమాదకర వాయువుల తీవ్రత

శ్వాసకోశ వ్యాధులతో సిటీజనుల పరేషాన్‌

సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్‌లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా వాహనాలు వదులుతున్న పొగ కారణంగా భూస్థాయి ఓజోన్‌ క్రమంగా పెరుగుతుంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంటోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్‌ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్‌ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్‌ రద్దీ సమయాల్లో ప్రధాన రహదారులపై భూ స్థాయి ఓజోన్‌ వాయువు గాలిలోని నైట్రోజన్‌ ఆక్సైడ్స్, ఒలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్‌లతో  కలిసిపోయి...సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్‌ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్‌ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. 

భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... 

  •      అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది. 
  •      గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. 
  •      ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. 

గ్రేటర్‌లో వాయు కాలుష్యానికి కారణాలివే.. 

  •      మహానగరంలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్‌ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.  
  •      పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. 
  •      శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మ ధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి.  
  •      ఘనపు  మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.   
  •      బాలానగర్,ఉప్పల్,జూబ్లీహిల్స్,చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది.  
  •      ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు బయటపడడం గమనార్హం.  
  •      గ్రేటర్‌ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. 
  •      గ్రేటర్‌ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి వస్తుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
  •      వాహనాల సంఖ్య 50 లక్షలు దాటినా..గ్రేటర్‌లో 7 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్‌మోనాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.     

ధూళికాలుష్యంతో అనర్థాలివే.. 
పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు,అస్తమా,క్రానిక్‌ బ్రాంకైటిస్,సైనస్‌ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయుకాలుష్యమే.  

ఇలా చేస్తే మేలు... 

  •      ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు,హెల్మెట్‌లు ధరించాలి. 
  •      కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.   
  •      కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. 
  •      ప్రజా రవాణావ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. 
  •      ప్రతీవాహనానికి ఏటా పొల్యూషన్‌ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. 
  •      ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి.   తద్వారా ట్రాఫిక్‌ సమస్య తగ్గి...పొల్యూషన్‌కు అడ్డుకట్ట పడుతుంది.
మరిన్ని వార్తలు