మబ్బులు.. జబ్బులు

21 Oct, 2019 02:09 IST|Sakshi

గ్రేటర్‌లో వినూత్న వాతావరణం

 ఉదయం మంచు, మధ్యాహ్నం మబ్బులు, సాయంత్రానికి వాన

పెరుగుతోన్న వాయు కాలుష్యం

వాయు కాలుష్యంలో ఢిల్లీతో పోటీపడుతోన్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం మంచు.. మధ్యా హ్నం ఆకాశం దట్టమైన క్యుములోనింబస్‌ మేఘాలతో ఆవృతమై పట్టపగలే కమ్ముకుం టున్న కారు చీకట్లు.. సాయంత్రం జడివాన.. దీనికితోడు భరించలేని స్థాయిలో పెరిగిన వాయు కాలుష్యం.. గాలిలోని తేమతో సమ్మి ళితం.. ఇదీ నగరంలో కొన్ని రోజులుగా నెల కొన్న వినూత్న వాతా వరణ పరిస్థితులు. శీతా కాలం ప్రారంభమవడం తో నగరంలో రాత్రి ఉష్ణో గ్రతలు క్రమంగా 20–18 డిగ్రీల వరకు పడి పోతుండటంతో గ్రేటర్‌ సిటీజన్లు తాజా వాతా వరణ మార్పులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్టోబర్‌ మూడో వారంలోనే నగరంలో వినూత్న వాతావరణ పరిస్థితి కారణంగా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో పలు రకాల శ్వాసకోశ వ్యాధులు, డెంగ్యూ, చికున్‌ గున్యా తదితర సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తు న్నాయి. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థి తుల్లో గాలిలో తేమ శాతం 87 శాతానికి చేరు కోవడంతో ధూళి కణాలు, వాహనాల నుంచి వెలువడుతోన్న నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు గాలిలోని తేమతో కలిసిపోతుండ టంతో సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించే పరి స్థితి కూడా కనాకష్ట మవుతోంది. వాయు కాలుష్య తీవ్రత ఇలాగే ఉంటే త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీ తరహాలో భరించలేని స్థాయికి చేరుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఊపిరి ఆడట్లేదు..
వాహన కాలుష్యంలో గ్రేటర్‌ నగరం త్వరలో దేశ రాజధాని ఢిల్లీని మించిపోయే ప్రమాదకర సంకేతాలు వెలువడుతున్నాయి. భాగ్యనగరంలో సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించలేని స్థాయిలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల మోతాదు క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రోజూ సగటున 69.51 టన్నుల మేర నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు వెలువడుతుండగా.. ఆ తర్వాత గ్రేటర్‌లో 63.51 టన్నుల మేర ఉత్పన్నమవుతున్నట్లు పీసీబీ తాజా కాలుష్య గణాంకాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. నైట్రోజన్‌ ఆక్సైడ్ల తీవ్రత రోజురోజుకూ పెరగడానికి ప్రధాన కారణం గ్రేటర్‌ పరిధిలో వాహన విస్ఫోటనం జరగడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పీసీబీ ప్రమాణాల మేరకు నిత్యం 50 టన్నుల నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు దాటితే పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైట్రోజన్‌ ఆక్సైడ్‌లకు తోడు ధూళికణాలు గాలిలోని తేమతో కలిసిపోతుండటంతో సిటీజన్ల శ్వాసకోశాలకు పొగబెడుతున్నాయి. స్వేచ్ఛగా శ్వాసించలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

పెరుగుతోన్న శ్వాసకోశ సమస్యలు..
గ్రేటర్‌ పరిధిలో సుమారు 2,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులున్నాయి. ఇటీవల కాలంలో వినూత్న వాతావరణ పరిస్థితులకుతోడు వాహన కాలుష్యం పెరగడం, వాతావరణ మార్పులు, గాలిలో తేమ శాతం పెరగడంతో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, సైనస్, బ్రాంకైటిస్‌ తదితర సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతోన్న వారి సంఖ్య వేలల్లోకి చేరింది. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులకు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ కాలుష్యం తోడవడమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు.

ఢిల్లీలో వాయుకాలుష్యం ఇలా.. 

  • ఢిల్లీలో నైట్రోజన్‌ ఆక్సైడ్స్, సల్ఫర్‌ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్, క్లోరో ఫ్లోరో కార్బన్లు అధికమై జనం శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 
  • మరోవైపు గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలిలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదు ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు మించరాదు. కానీ పలు చోట్ల 450 నుంచి 500 మైక్రోగ్రాములుగా నమోదవడం గమనార్హం.
  • ఘనపు మీటరు గాలిలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ మోతాదు 120 గ్రాములకు మించరాదు. కా>నీ 150 మైక్రో గ్రాములుగా నమోదవడం గమనార్హం. 
  • ఘనపు మీటరు గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ఒక మైక్రోగ్రాము మించరాదు. కానీ పలు ప్రాంతాల్లో 3 మైక్రో గ్రాములకు చేరుకుంది.
  • ఘనపు మీటరు గాలిలో లెడ్‌ మోతాదు 0.75కు మించరాదు. కానీ 2 మైక్రోగ్రాములకు మించింది.
  • దీనికితోడు దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇటీవల 200 మీటర్ల దూరం ఉన్న వస్తువులను సైతం ఢిల్లీ వాసులు చూడలేకపోతున్నారు. 
  • దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది.

గ్రేటర్‌లో కాలుష్యం ఇలా..

  •  గ్రేటర్‌లో నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు నిత్యం 63.51 టన్నుల మేర నమోదవుతున్నాయి.
  • నగరంలో ప్రతి ఘనపు మీటరు గాలిలో స్థూల, సూక్ష్మ ధూళికణాల మోతాదు 96 మైక్రో గ్రాములుగా నమోదవుతోంది. నిబంధనల ప్రకారం ఈ మోతాదు 60 మైక్రో గ్రాములు మించరాదు.
  •  ఘనపు మీటరు గాలిలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ 120 మైక్రో గ్రాములకు మించరాదు. మన నగరంలో 135 మైక్రో గ్రాములుగా నమోదవుతోంది.
  • ఘనపు మీటరు గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ మోతాదు ఒక మైక్రోగ్రాము మించరాదు. కానీ నగరంలో 2 మైక్రో గ్రాములుగా నమోదవుతుంది.
  • ఘనపు మీటర్‌ గాలిలో లెడ్‌ మోతాదు 0.75 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఒక మైక్రోగ్రాము మేర నమోదవుతోంది.

ఊపిరితిత్తులకు అనర్థమే: డాక్టర్‌ రఫి, పల్మనాలజిస్ట్, కేర్‌ ఆస్పత్రి
నగరంలో వాహన కాలుష్యం భవిష్యత్‌లో ఢిల్లీని మించే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య భరితమైన బీజింగ్‌ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మోక్‌ కలెక్టివ్‌ టవర్స్‌ (పొగ, కాలుష్యం గ్రహించే స్తంభాలు)ఏర్పాటు చేశారు. మన దగ్గర కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలి. ఇటీవలి కాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంది. వాహన కాలుష్యం మానవ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుండటంతో యాంటీబయాటిక్స్‌కు లొంగని స్థాయిలో జలుబు, దగ్గు, బ్రాంకైటిస్‌తో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

గ్రేటర్‌లో గత ఐదు అక్టోబర్‌ నెలల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలిలా..
ఏడాది    తేదీ    కనిష్ట ఉష్ణోగ్రత
2018    28    16.3
2017    28    16.6
2016    28    16.3
2015    08    19.3
2014    30    16.8

మరిన్ని వార్తలు