22 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ నియామకాలు 

15 Dec, 2018 03:04 IST|Sakshi

సిద్దిపేటలో శారీరక, మెడికల్‌ పరీక్షల నిర్వహణ 

ఎయిర్‌ ఫోర్స్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ నరేంద్ర వెల్లడి 

సాక్షి, సిద్దిపేట: ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్లు ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ నరేంద్ర కుమార్కర్‌ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయంలో స్థానిక డీఆర్‌వో చంద్రశేఖర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సిద్దిపేటలోనే నియామకాలు జరుగుతాయని చెప్పారు. దేహదారుఢ్య, రాతపరీక్ష పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. 22, 23 తేదీల్లో 15 జిల్లాల నుంచి వచ్చిన వారికి, 24, 25 తేదీల్లో మిగిలిన 16 జిల్లాల వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే వారు ఉదయం 5 గంటల వరకు చేరుకోవాలన్నారు. 21న ముందస్తుగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇంటర్‌ బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పురుషులు మాత్రమే అర్హులని వివరించారు. అభ్యర్థులు 1998 జూలై 14 నుంచి 2002 జూన్‌ 28 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని తెలిపారు.  

డిసెంబర్‌ 22, 23 తేదీల్లో: ఈ నెల 22, 23 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, జనగామ, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, హైదరాబాద్‌ జిల్లాలకు, 24, 25ల్లో ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల వారికి శారీరక, మెడికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల్లోపు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని వివరించారు. 

మరిన్ని వార్తలు