సీఎస్‌గా అజయ్‌మిశ్రా!

31 Dec, 2019 04:02 IST|Sakshi

నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి పదవీ విరమణ

కొత్త సీఎస్‌ రేసులో సోమేశ్‌కుమార్‌ కూడా..   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శైలేంద్రకుమార్‌ జోషి మంగళవారం పదవీ విర మణ చేయనున్నారు. సీనియారిటీ, సమర్థతలను పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్‌ ఎంపికపై నేడు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సీఎస్‌ రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ముందంజ లో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన మిశ్రాకు సీనియారిటీ కలిసి వస్తుండటంతో ఆయననే సీఎస్‌గా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే, 1989 బ్యాచ్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌ పనితీరు పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న సానుకూల దృక్పథం కూడా కొత్త సీఎస్‌ ఎంపికలో కీలకంగా మారే అవకాశముంది. మిశ్రాను సీఎస్‌గా నియమిస్తే 2020 జూన్‌ వరకు పదవి లో కొనసాగుతారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. సోమేశ్‌ కుమార్‌ పదవీ విరమణ సమయం 2023 డిసెంబర్‌ నెలాఖరుకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే మాత్రం, జోషి వారసుడిగా సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వం తరఫున సన్మానం
ఎస్‌కే జోషి పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌ 9వ అంతస్తులోని సమావేశ మందిరంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొననున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా