ఆస్పత్రిలో చేరిన అక్బరుద్దీన్‌

22 Dec, 2018 16:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ తీవ్ర కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విందుకు హాజరైన సమయంలో అక్బరుద్దీన్‌కు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో.. ఆయన్ను ఓవైసీ ఆసుపత్రిలో చేర్పించారు. సోదరుడు అసదుద్దీన్‌ ఓవైసీతో పాటూ బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఆయనను పరామర్శించి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మినహా మిగతా ఎవరినీ ఆసుపత్రి లోపలికి అనుమతించడంలేదు.

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్బరుద్దీన్ చాంద్రాయణ గుట్ట నుంచి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో ఓ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా తన ఆరోగ్యం బాగా లేదని చెప్పారు. కిడ్నీల సమీపంలో బుల్లెట్ ముక్కలు ఉన్నాయని తెలిపారు. డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారని అన్నారు. అక్బర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబసభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు