ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేయాలి: అక్బరుద్దీన్ ఒవైసీ

13 Nov, 2014 02:18 IST|Sakshi
ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేయాలి: అక్బరుద్దీన్ ఒవైసీ

* బడ్జెట్ ప్రసంగంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్   
* రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.29 వేల రుణభారం ఉంది
* ఆ అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారో చెప్పలేదు
* మైనార్టీలకు ప్రత్యేక ఉపప్రణాళిక అమలు చేయాలని డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి కన్నా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఎంఐఎం సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై ఒవైసీ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.29 వేల రుణభారం ఉందని, అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారన్న లెక్కలను బడ్జెట్‌లో చూపించలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీలో కమలనాథన్, ప్రత్యూష్‌సిన్హా కమిటీలు విఫలమయ్యాయని ఆరోపించారు. తెలంగాణకు ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరిస్తామన్నారు. బీసీ, మైనారిటీలకు వేర్వేరుగా ఉప ప్రణాళికలను ఏర్పాటు చేయాలన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే మైనారిటీలే తీవ్ర వెనుకబాటుకు గురయ్యారన్న విషయం అనేక కమిటీ నివేదికల ద్వారా స్పష్టమైంది. అందువల్ల మైనారిటీలకు కూడా ప్రత్యేకంగా ఉప ప్రణాళికను ఏర్పాటు చేయాలి. ఉర్దూ టీచర్ల నియామకాలకు ప్రత్యేక డీఎస్‌సీ వేయాలి.
 
 రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు ప్రత్యేక కమిషన్ నియమించాలి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలి. స్కాలర్‌షిప్‌లకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగా మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలి. నూతనంగా ఉర్దూ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ప్రతీ జిల్లా కేంద్రంలో మైనారిటీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లను నియమించాలి. మైనారిటీ శాఖలో కేవలం వంద మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. వారి సంఖ్యను మరింతగా పెంచాలి’’ అని అక్బరుద్దీన్ కోరారు. ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్ వంటి జాతీయ, బహుళజాతి సంస్థలకు గత ప్రభుత్వాలు వక్ఫ్ భూములను ధారాదత్తం చేశాయని, నిర్మాణాలు పోను ఖాళీగా ఉన్న స్థలాలను వెనక్కు తీసుకొని వక్ఫ్‌కు అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మక్కాలో సౌదీ అరేబియా ప్రభుత్వం చేస్తున్న విస్తరణ కార్యక్రమాల్లో.. నాడు నిజాం ప్రభువులు రుబాత్ (రాష్ట్రం నుంచి మక్కాకు వెళ్లే యాత్రికుల కోసం నిర్మించిన సత్రాలు)లు కూల్చివేతలకు గురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కోల్పోయిన ఆస్తులకు నష ్టపరిహారాన్ని పొందాలని, ఆ మొత్తంతో మరోచోట రుబాత్‌లను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.
 
 ఆకట్టుకున్న ‘అక్బర్’ కథ....
 రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రస్తుత బడ్జెట్ లెక్కలను ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ చెప్పిన ఒక చిన్న కథ సభలో నవ్వులు పూయించింది. ఆయన చెప్పిన కథేంటంటే... ‘‘ఓ గాయకుడు బాద్‌షా వద్దకు వచ్చి తన గాన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాడు. దానికి మెచ్చిన బాద్‌షా అతనికి బహుమతి ప్రకటిస్తాడు. దీంతో మరింత మంచి గానాన్ని ఆలపించడంతో పరవశుడైన బాద్‌షా మరిన్ని బహుమానాలు ప్రకటిస్తాడు. దీంతో గాయకుడు రెట్టించిన ఉత్సాహంతో పాడటం మొదలుపెడతాడు. ఆనందంతో తేలియాడుతున్న బాద్‌షా అతనికి బంగారం, భూమి, వజ్రాలు, కానుకలు ప్రకటిస్తూ పోయాడు.
 
 సంతోషంతో గాయకుడు తన ఇంటికి వె ళ్లి భార్యతో విషయం అంతా చెబుతాడు. అయితే రెండు, మూడు, నాలుగు రోజులైనా రాజు కురిపించిన వరాలేవీ గాయకుడి దగ్గరకు చేరలేదు. గాయకుడు మళ్లీ బాద్‌షా వద్దకు వస్తాడు. ‘రాజా.. నాకు మీరు ఇస్తానన్న బంగారం, భూమి, వజ్రాలు ఏవీ నాకివ్వలేదు. ఎప్పుడిస్తారు’ అని ప్రశ్నిస్తాడు. అందుకు బాద్‌షా స్పందిస్తూ, ‘ఎక్కడి భూమి, ఎక్కడి బంగారం, ఎక్కడి వజ్రాలు.. మీరు గానంతో నా చెవిని సంతోషపెట్టారు. నేను నా వరాలతో నీ చెవిని సంతోషపెట్టాను. అంతే’ అని బదులిస్తాడు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సైతం అలాగే ఉందనీ... వరాలు ఉన్నాయి కానీ అవి ప్రజలకు చేరుతాయా? లేదా? అన్నది సందేహమే’’ అని అక్బరుద్దీన్ అనడంతో స్పీకర్ సహా సభలో ఉన్న వారంతా గొల్లుమంటూ నవ్వారు.

మరిన్ని వార్తలు