లండన్‌ ఆసుపత్రిలో అక్బరుద్దీన్‌ ఒవైసీ

10 Jun, 2019 02:13 IST|Sakshi

కోలుకోవాలని ప్రార్థించండి: అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి   

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్ర అనారోగ్యానికి గురై లండన్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు రెగ్యులర్‌గా వైద్య సేవలు అందించే వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. గత పక్షం రోజులక్రితం రంజాన్‌ పర్వమాసం సందర్భంగా సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఉమ్రా ప్రార్థనల అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం సమయంలో అనారోగ్యానికి గురికావడంతో రెగ్యులర్‌ చెకప్‌కోసం వెళ్ళే లండన్‌లోని ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. అక్కడి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని కొద్దిరోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు.

రంజాన్‌ కూడా అక్కడే జరుపుకున్నారు. కాగా, గత రెండు రోజుల క్రితం అక్బరుద్దీన్‌ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తీవ్ర గాయాలకు గురికావడంతో ఇప్పటికీ అక్బరుద్దీన్‌ కడుపు నొప్పితో బాధ పడుతూ ఉంటారు. మెరుగైన వైద్యం కోసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి లండన్‌లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని వస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురై స్థానికంగా చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు.

తాజాగా తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. కాగా, దారుస్సలేంలో జరిగిన ఈద్‌–మిలాప్‌ సందర్భంగా తన సోదరుడు అక్బరుద్దీన్‌ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోగ్యంపై ఆందోళన చెలరేగింది. అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోగ్యంకోసం పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు