వక్ఫ్‌బోర్డును రద్దు చేయండి

14 Mar, 2020 02:30 IST|Sakshi

వక్ఫ్‌ బోర్డులో అక్రమాలపై అక్బరుద్దీన్‌ మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ముస్లింలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. వారి అభ్యున్నతికి కావాల్సినంత మొత్తం భరించేంత ఆస్తి వక్ఫ్‌ వద్దే ఉంది. కానీ ఆ వక్ఫ్‌ సంపదను కొందరు దోచుకుంటున్నా పట్టించుకోవట్లేదు. వక్ఫ్‌ బోర్డును కొనసాగించాలంటే నిజాయితీ ఉన్న వారిని బాధ్యులుగా పెట్టండి.. లేదంటే వక్ఫ్‌ బోర్డునే రద్దు చేయండి’అని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.

‘ముస్లింలకు రంజాన్‌ వేళ ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో ఖర్చు చేసే మొత్తాన్ని మైనారిటీల్లోని అనాథల సంక్షేమం కోసం ఖర్చు చేయండి. దాన్ని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇవ్వండి’అని చెప్పారు. మైనారిటీల అభ్యున్నతికి మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే మజ్లిస్‌ పార్టీ ఆయనకు మద్దతు తెలుపుతోందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మేలు జరుగుతున్న 54 అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూనే, అవసరమైన విషయాల్లో నిలదీసేందుకూ వెనకాడబోమని తేల్చిచెప్పారు. వక్ఫ్‌బోర్డులో జరుగుతున్న లోపాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

కనీస అర్హతలు కూడా లేనివారికి పదోన్నతులు కల్పిస్తూ భారీ ఎత్తున జీతాల రూపంలో ప్రజా ధనాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పదో తరగతి చదివిన వారిని ఏకంగా సహాయ కార్యదర్శి పోస్టులో కూర్చోబెట్టారని, వారికి రూ.లక్ష చొప్పున జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మూడో తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తిని ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమించారని, ఆయనకు రూ.54 వేల జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సీబీఐతో లేదా సీఐడీతో లేదా హైకోర్టు విశ్రా>ంత జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వక్ఫ్‌ అక్రమాల గురించి గొంతెత్తుతున్నా పట్టించుకోవట్లేదని, తన జుట్టు నెరుస్తున్నా మార్పు లేదని అసహనం వ్యక్తం చేశారు. వక్ఫ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని కోరారు.
 

మరిన్ని వార్తలు