-

‘అక్ష’రాల రూ.15 కోట్లు..

23 Apr, 2015 02:41 IST|Sakshi
‘అక్ష’రాల రూ.15 కోట్లు..

మంచిర్యాల రూరల్ : ఈ ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు వస్తుండడం.. పుష్కరాలకు ముందుగానే వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం ‘కనక’ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు ఒక్క రోజే రికార్డు స్థాయిలో జరిగాయి. పెళ్లిళ్లలో బంగారు ఆభరణాల కోసం దుకాణాల వద్ద బంధువులు బంగారం కొనుగోలు చేస్తుంటే, అక్షయ తృతీయ సంటిమెంట్‌తో దుకాణానికి వచ్చిన వారు బంగారం కొనేందుకు బారులు తీరారు.

బంగారం, రెడీమేడ్ నగల దుకాణాలు మంగళవారం ఉద యం నుంచి రాత్రి వరకు అమ్మకాలు సాగించాయి. పెళ్లిళ్ల సీజను, అక్షయ తృతీయ కావడంతో కొనుగోలుదారులతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏ డాది దుకాణాలు కిక్కిరిశాయి. జిల్లాలో రెండేళ్లలో అక్షయతృతీయ రోజున రూ.10కోట్లు, రూ.11కోట్ల బంగారం విక్రయాలు జరుగగా.. ఈసారి అదనంగా నాలుగు కోట్లు పెరిగి రూ.15 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి.
 
ధర తగ్గడమూ కారణమే..
2014లో అక్షయ తృతీయ రోజున బంగారం ధర 24 క్యారెట్లు రూ.36,100, పది గ్రాముల ధర 30,860 ఉండగా, ఈ ఏడాది రూ.4 వేలు తగ్గింది. 24 క్యారెట్లు(11.6 గ్రాముల) ధర రూ.32,200 ఉండగా, పది గ్రాముల బంగారం రూ. 27,600లుగా ఉంది. బంగారం ధర తక్కువగా ఉండడం కూడా కలిసి వచ్చింది. దీంతో మధ్య తరగతి ప్రజలను బంగారం కొనుగోలు చేసేలా చేసింది. గతేడాది రూ.300లకు గురిజెత్తు బంగారం కొని సరిపెట్టుకున్న వారు ఈ ఏడాది రెండు వేల నుంచి పది వేల వరకు ఖర్చు చేసి 2 నుంచి 5 గ్రాముల వరకు బంగారం కొనేందుకు మొగ్గు చూపారు.

దీంతో సుమారుగా రూ.15 కోట్లకు పైగానే బంగారం అక్షయ తృతీయ రోజున విక్రయాలు జరిగినట్లు వ్యాపారుల అంచనా. అక్షయ తృతీయకు ముందు రోజు కంటే బంగారం ధర మంగళవారం నాటికి రూ.500 వరకు పెరిగింది. కానీ.. కొనుగోలుదారులు మాత్రం బంగారం ధర పెరిగిన విషయాన్ని పట్టించుకోకుండా, గతేడాది కంటే తక్కువగా ఉందనే భావనతో అధికంగా కొనుగోళ్లు జరిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, లక్సెట్టిపేట, ముథోల్ ప్రాంతాల్లో బంగారు అమ్మకాలు జోరుగా సాగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు